ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీద తెలంగాణ నేతల మాటల దాడి పెరుగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు పవన్ మీద మూకుమ్మడి దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఎవరూ పవన్ వ్యాఖ్యలను ఖండించలేదు. అయితే తాజాగా జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) పవన్ కల్యాణ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలు ఏనాడూ ఏపీకి దిష్టి పెట్టలేదని గుర్తు చేశారు. కోనసీమ కూడా తెలంగాణలాగా కావాలని మాత్రమే కోరుకున్నారని గుర్తు చేశారు. ఇక్కడి బిడ్డలు త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు రాకముందు నుంచే తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పదని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలు ఎప్పుడూ సంకుచితంగా ఆలోచించరని .. పెద్దగా మాత్రమే ఆలోచిస్తారని గుర్తు చేశారు. ‘రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యింది. ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా’ అనే అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో…ఆంధ్రా కూడా అంతే బాగుండాలని ఇక్కడి ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా డిమాండ్ చేశా
తాను ఎంపీగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో డిమాండ్ చేశానని కవిత(Kavitha) గుర్తు చేశారు. ‘పక్కోడు బాగుంటే మా కళ్లు మండవు. పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం కాదు. మేము బాగుండాలనే కోరుకుంటాం. పక్కోడు చెడిపోవాలని అనుకోం.’ అని కవిత పేర్కొన్నారు. ఒకవేళ తెలంగాణ ప్రజలు ఏపీ మీద ద్వేషంతో ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపం మరోలా ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప… పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి కూడా ఎత్తలేదని పేర్కొన్నారు. గతంలో సినిమా నటుడిగా ఉన్న పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండికూడా అదే రకంగా మాట్లాడటం హుందాగా లేదని పేర్కొన్నారు.
పవన్ స్పందనేంటో?
ఎప్పుడో పది రోజుల క్రితం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిష్టి వ్యాఖ్యలు చేస్తే మొదట్లో పెద్దగా స్పందన రాలేదు. కానీ క్రమంగా ఆయన కామెంట్ల దుమారం రేగుతోంది. పవన్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతల నుంచి భారీ స్పందన వస్తుందని అంతా ఆశించారు. కానీ అందుకు భిన్నంగా వారి నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ ఆ తర్వాత క్రమంగా పవన్ కల్యాణ్ మీద కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు ఈ దుమారం మరింత ఎక్కువవుతోంది. మరి పవన్ కల్యాణ్ స్పందనేమిటో వేచి చూడాలి.
Read Also: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు అసహనం
Follow Us On: Instagram


