కలం, వరంగల్ బ్యూరో: ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక కళాక్షేత్రానికి (Kaloji Kalakshethram) ఇప్పుడు నిర్వహణ భారం సమస్యగా మారిందా? కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని పూర్తిస్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగించలేని పరిస్థితి నెలకొందా? నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) కార్యాలయాన్ని అందులోకి తరలించారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కళాక్షేత్ర నిర్వహణ ఖర్చులు భారంగా మారుతు న్నాయనే ప్రచారం.
మరోవైపు కుడాకు ఇప్పటికే సొంత భవనం, అవసరమైన వసతులు ఉన్నప్పటికీ అక్కడి నుంచి తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాక్షేత్ర నిర్వహణకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే రెండో, మూడో అంతస్తుల్లో కుడా ఆఫీసును ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలేమిటి? కార్యాలయ తరలింపుతో ఎంత మేరకు ఖర్చు తగ్గుతున్నది? కళాక్షేత్ర నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించినది? అనే అంశాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
పదేళ్ల కాలం.. రూ.95 కోట్ల వ్యయం
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవాలన్న లక్ష్యంతో హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో కాళోజీ కళాక్షేత్ర (Kaloji Kalakshethram) నిర్మాణానికి 2014 సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు 4.25 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తొలుత రూ.30 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో వ్యయం సుమారు రూ.95 కోట్లకు చేరింది. నిధుల కొరత, కరోనా తదితర కారణాలతో పనులు నత్తనడకన సాగాయి. తొలుత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన పనులు ఆ తర్వాత కుడా పర్యవేక్షణలో కొనసాగాయి. దాదాపు పదేళ్ల తర్వాత 2024 నవంబర్ 19న సీఎం రేవంత్‌రెడ్డి కళాక్షేత్రాన్ని ప్రారంభించి, కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నిర్వహణే అసలు సమస్య!
నాలుగు అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో ప్రధాన ఆడిటోరియం, బాల్కనీ కలిపి సుమారు 1,400 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉంది. అత్యాధునిక సౌండ్, లైటింగ్ వ్యవస్థలతో పాటు ఇతర వసతులు కల్పించారు. ఇంతటి భారీ భవనాన్ని నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, నిధులు, ఆదాయ వనరులపై ముందస్తు ప్రణాళిక కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు భారంగా మారినట్లు తెలుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లోనే భవనంలోని కొంత భాగాన్ని ప్రభుత్వ ఆఫీసుకు కేటాయిస్తే నిర్వహణ ఖర్చుల్లో కొంత వెసులుబాటు లభిస్తుందనే ఆలోచనతో కుడా కు ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
సొంత భవనం ఖాళీ ఎందుకు?
హనుమకొండలోని ఆర్డీవో ఆఫీసు పక్కన కుడాకు సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత భవనం ఉంది. 20 ఏళ్లుగా అక్కడి నుంచే సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఐదేళ్ల కింద సుమారు రూ.5 కోట్లతో భవన ఆధునికీకరణ పనులు కూడా చేపట్టారు. అదే భవనంలో సహకార శాఖకు చెందిన కొన్ని ఆఫీసులు సైతం ఉన్నాయి. ఇన్నిసౌకర్యాలు ఉన్నప్పటికీ కుడా ఆఫీసును కాళోజీ కళాక్షేత్రంలోకి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాత భవనాన్ని వాణిజ్య అవసరాలకు లీజుకు ఇచ్చేందుకు ఆరు నెలల కిందే ఈ-బిడ్స్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కుడా సీపీఓ అజిత్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పాత భవనాన్ని 99 ఏళ్ల లీజుకు ఇచ్చే అంశం కూడా చర్చలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కళాకారుల వేదిక.. కార్యాలయాల అడ్డాగా?
కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశం కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు శాశ్వత వేదిక కల్పించడం. అయితే ప్రారంభమై రెండేళ్లు కావస్తున్నా ఆశించిన స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. కాళోజీ ఫౌండేషన్‌కు హామీ ఇచ్చిన 200 సీట్ల సమావేశ మందిరం, రెండు గదుల కేటాయింపు కూడా ఇంకా పెండింగ్‌లో ఉందని కళాకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కళాక్షేత్రంలో ఇతర ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయవద్దని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ డిమాండ్ చేశారు.
సమాధానం చెప్పేదెవరు?
కాళోజీ కళాక్షేత్రంలోకి కుడా ఆఫీసు తరలించినప్పటికీ, ఆ నిర్ణయం వెనుక కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఒకవైపు కళాక్షేత్ర నిర్వహణకు నిధులు, సిబ్బంది కొరత.. మరోవైపు కుడాకు సొంత భవనం ఉండగానే ఆఫీసు తరలింపు.. ఇంకోవైపు కళాకారులకు ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం.. ఇలా అనేక విషయాలు విస్తృత చర్చకు వస్తున్నాయి. కళాక్షేత్ర నిర్వహణకు ప్రత్యేక నిధులు, సిబ్బందిని కేటాయించి సాంస్కృతిక కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కళాకారులు కోరుతున్నారు.

