సినీ ఫక్కీలో ఛేజ్.. ఘరానా దొంగ అరెస్ట్

కలం, మధిర: ఇంటి యజమాని కదలికలపై నిఘా పెట్టి, తాళం చెవి దాచే చోటును పసిగట్టి దర్జాగా చోరీకి పాల్పడిన ఘరానా దొంగ ఆటను కల్లూరు పోలీసులు(Kalluru Police) కట్టించారు. ఆదివారం వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతున్న నిందితుడిని ఎస్ఐ బృందం సినిమా ఫక్కీలో వెంబడించి పట్టుకోవడమే కాకుండా, చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేసింది.

కల్లూరు పట్టణ శివారు ఖాన్ ఖాన్ పేటకు చెందిన అజ్మీరా నరసింహ ఇంటిపై అదే ప్రాంతానికి చెందిన, స్థానికంగా రెస్టారెంట్ సప్లయర్‌గా పనిచేస్తున్న భరోతు నాగ వెంకటేశ్వర్లు అలియాస్ చంటి కన్నేశాడు. ఇంటి యజమాని బయటకు వెళ్లేటప్పుడు తాళం చెవిని ఎక్కడ పెడుతున్నాడో చంటి కొద్దిరోజులుగా నిశితంగా గమనించాడు. ఇటీవల ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో, యజమాని కరెంట్ మీటర్ వెనుక దాచిన తాళం చెవిని తీసుకుని తలుపులు తెరిచాడు. ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాల సంచిని అపహరించి అక్కడి నుంచి ఉడాయించాడు.

చోరీ చేసిన సొత్తులో ఒక జత (6 గ్రాములు) బంగారు జూకాలను కల్లూరులోని ‘విజయకృష్ణ ఫైనాన్స్‌’లో తనఖా పెట్టి రూ.30 వేల నగదు తీసుకున్నాడు. మిగిలిన బంగారు, వెండి ఆభరణాలను తన ద్విచక్ర వాహనం (హీరో గ్లామర్) ట్యాంక్ కవర్‌లో దాచి, వాటిని విక్రయించేందుకు తిరువూరు వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో ఎన్ఎస్పీ క్రాస్ రోడ్డు వద్ద కల్లూరు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను చూడగానే నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వస్తున్న చంటి కంగారుపడి వెనక్కి తిరిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఎస్ఐ బృందం అతడిని సినిమా ఫక్కీలో వెంబడించి అదుపులోకి తీసుకుంది.

పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. తానే ఈ చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడంతో, బైక్ ట్యాంక్ కవర్‌లో దాచిన ఆభరణాలతో పాటు ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టిన బంగారు జూకాలను పోలీసులు రికవరీ చేశారు. నిందితుడి నుంచి మొత్తం 12 గ్రాముల బంగారు ఆభరణాలు, 230 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్ లేని హీరో గ్లామర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి తాళం చెవులను బయట ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టవద్దని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>