లీగల్ బ్యాటిల్ టు స్ట్రీట్ ఫైట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటెజీ…

కలం, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులోని (Kaleshwaram Project) అవకతవకలు, అవినీతి ఆరోపణలపై గడచిన రెండున్నరేండ్లుగా బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ తూర్పారబట్టింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్‌కు నైతికంగా భారీ ఊరట ఇస్తే కాంగ్రెస్‌ను మాత్రం డిఫెన్సులోకి నెట్టినట్లయింది. హైకోర్టు తన తీర్పులో ఎంక్వయిరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. ఎంక్వయిరీ జరిగిన తీరును, అనుసరించిన విధానాన్ని, రూపొందించిన నివేదికలోని అంశాలను మాత్రం తప్పుపట్టింది. దీంతో డైరెక్టుగా కాంగ్రెస్‌కు (Congress) ఎలాంటి మచ్చ అంటుకోకపోయినా రాజకీయ ప్రత్యర్థులైన కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టు తీర్పు రిలీఫ్ ఇవ్వడం పొలిటికల్‌గా కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేండ్లు ఉండడంతో ఇప్పటి నుంచీ రాజకీయ ప్రత్యర్థుల ఫోకస్ అంతా కాళేశ్వరం చుట్టూ తిరిగే అవకాశమున్నది. లీగల్ బ్యాటిల్ స్థానంలో ఇకపైన పొలిటికల్ స్ట్రీట్ ఫైట్ షురూ కానున్నది.

ఇకపైనా హాట్ టాపిక్‌గా కాళేశ్వరం ఇష్యూ :

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (PC Ghose Commission) నివేదికపై హైకోర్టు వ్యాఖ్యలు ఎలా ఉన్నా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య ఈ ఇష్యూ ఇకపైన కూడా హాట్ టాపిక్‌గానే కొనసాగే అవకాశమున్నది. కాళేశ్వరం విషయంలో రెండున్నరేండ్లుగా కేసీఆర్, హరీశ్‌రావులతో పాటు బీఆర్ఎస్‌ ప్రజల్లో దోషిగా నిలబడింది. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్‌తో రిలీఫ్ వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వస్తుందనేది కీలకం. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా?.. లేక ఇప్పటికే సీబీఐ దర్యాప్తును కోరినందున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందా?.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ కమిషన్ నివేదిక, ఎన్డీఎస్ఏ రిపోర్టుల ఆధారంగా సీబీఐ ఎంక్వయిరీకి పట్టుబడుతుందా?.. ఇలాంటివి కీలకంగా మారాయి. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశపై తదుపరి యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు.

నేటి క్యాబినెట్ భేటీలో హైకోర్టు తీర్పుపై చర్చ :

ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై చర్చ జరిగే అవకాశమున్నది. ఈ తీర్పుపై మంత్రుల అభిప్రాయాలను క్యాబినెట్ చర్చించనున్నట్లు ప్రాథమిక సమాచారం. హైకోర్టు నుంచి పూర్తిస్థాయి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అడ్వొకేట్ జనరల్, ఇరిగేషన్ డిపార్టుమెంటు లాయర్లతో చర్చించిన తర్వాత రాష్ట్ర సర్కార్ తదుపరి నిర్ణయాన్ని తీసుకోనున్నది. జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వయిరీ ప్రొసీజర్‌ను, అది ఇచ్చిన నివేదికపై మాత్రమే హైకోర్టు అభ్యంతరాలను వ్యక్తం చేసిందిగానీ కమిషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోని మెరిట్స్ జోలికి వెళ్ళకపోవడంతో కేసీఆర్, హరీశ్‌రావులకు క్లీన్ చిట్ ఇవ్వలేదని పీసీసీ చీఫ్ సహా కాంగ్రెస్ నేతలు పలువురు రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్‌కు కొత్త ఆక్సిజన్‌గా హైకోర్టు తీర్పు :

కాళేశ్వరం (Kaleshwaram) కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఈ తీర్పు అటు కాంగ్రెస్ వ్యూహాలను, ఇటు బీఆర్ఎస్ పునరుజ్జీవన ప్రయత్నాలను పొలిటికల్‌గా గణనీయంగా ప్రభావితం చేయనున్నది. ఈ తీర్పు బీఆర్ఎస్‌కు రాజకీయంగా ఆక్సిజన్‌గా మారింది. ఈ తీర్పును ‘నైతిక విజయం’గా ప్రచారం చేసుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే విచారణలు చేయిస్తోందని, న్యాయస్థానం ముందు అవి నిలబడట్లేదనే రాగాన్ని గులాబీ నేతలు అందుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ తీర్పు ఒకింత ఉత్సాహాన్నిచ్చింది. జగిత్యాల సభ జోష్‌తో కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తారని గులాబీ లీడర్లు లీకులు ఇస్తున్న సమయంలో హైకోర్టు తీర్పును ‘ప్లస్ పాయింట్’గా మల్చుకునే అవకాశమున్నది.

కౌంటర్ స్ట్రాటెజీలపై కాంగ్రెస్ నెక్స్ట్ ఫోకస్ :

హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా బీఆర్ఎస్‌కు అనుకూలంగా రావడం నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ క్రెడిబిలిటీకి ఇబ్బందికరంగా మారింది. కాళేశ్వరంలో (Kaleshwaram) లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఇంతకాలం కాంగ్రెస్ ప్రచారం చేసినా హైకోర్టు తీర్పు మరో రకంగా రావడంతో కోర్టులో వాదనల సమయంలో దీటుగా వాదించలేకపోయిందనే అభిప్రాయానికి తావిచ్చినట్లయింది. టెక్నికల్ అంశాలతో సంబంధం లేకుండా ‘కాంగ్రెస్‌ ఓడిపోయింది.. బీఆర్ఎస్ గెలిచింది..’ అనే ఒక సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని కాంగ్రెస్ గ్యారంటీలు, హామీలపై బీఆర్ఎస్ ఒత్తిడి పెంచే అవకాశం ఉండడంతో సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.

Read Also: కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ వార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>