కలం, వెబ్ డెస్క్ : కాకినాడ (Kakinada) రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ పనుల కోసం రోడ్డు దాటుతున్న కూలీలను వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వీరబాబు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (GGH) తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
లోకేశ్ దిగ్భ్రాంతి.. అండగా ఉంటామని హామీ
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి పనులకు వెళ్తూ కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

