కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లా అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హైదరాబాద్ పర్యటన సందర్భంగా వరంగల్‌కు సంబంధించిన మూడు ప్రధాన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట–విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్, కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో జిల్లా ప్రజలలో ఆనందం వెల్లివిరిసింది.
టెక్స్‌టైల్ పార్క్‌తో ఉపాధి అవకాశాలు
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో 2016లో 1337 ఎకరాలలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్(Kakatiya Mega Textile Park) కోసం భూసేకరణ చేపట్టారు. అనంతరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినప్పటికీ, అనుకున్న స్థాయిలో పరిశ్రమలు ముందుకు రాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకం కింద ఈ పార్క్‌ను బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీలో ఎంపిక చేసి తొలి విడతగా రూ.200 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు రూ.1695 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పార్క్ ద్వారా సుమారు 24 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రస్తుతం దాదాపు 2 వేల మందికి ఉపాధి లభిస్తోంది.
కాజీపేట రైల్వే కనెక్టివిటీ విస్తరణ
ఉత్తర–దక్షిణ భారత రైల్వే రవాణాకు కీలక కేంద్రంగా ఉన్న కాజీపేట జంక్షన్ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. కాజీపేట–విజయవాడ మధ్య పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.1243 కోట్లతో మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేశారు. అలాగే రూ.240 కోట్లతో 21 కిలోమీటర్ల పొడవైన రైల్ అండర్ రైల్ బైపాస్ ప్రాజెక్టును నిర్మించారు. కోమటిపల్లి నుంచి వడ్డేపల్లి చెరువు వరకు భూమి అడుగున సుమారు 340 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని నిర్మించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా నిలిచింది. ఈ బైపాస్ ద్వారా సికింద్రాబాద్, బల్లార్షా, విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా ప్రయాణించనున్నాయి. ప్రధాని మోదీ ఈ కీలక ప్రాజెక్టులను ప్రారంభించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

