కలం, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ రంగానికి మరో తిరుగులేని విజయం లభించింది! అసన్ నగరంలో ఆదివారం జరిగిన కొరియా మాస్టర్స్ ఫైనల్లో భారత యంగ్ స్టార్ అస్మిత చాలిహా (Asmiti Chaliha) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఏట BWF వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్ గెలుచుకున్న మూడో భారత మహిళా సింగిల్స్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
గువాహటికి చెందిన 26 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్, కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్ పోరులో చైనాకు చెందిన హాన్ కియాన్ సీపై అస్మిత తీవ్రంగా పోరాడింది. 53 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయినా, అస్మిత అద్భుతంగా పుంజుకుంది. 14-21, 21-14, 21-14 తేడాతో చైనా ప్లేయర్‌ను ఓడించి కొరియా మాస్టర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
క్వార్టర్ ఫైనల్లోనే టాప్ సీడ్ హినా అకెచిని ఓడించి అస్మిత అందరి దృష్టిని ఆకర్షించింది. ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఆమె శుభారంభం చేసి, ఒక దశలో 9-5 ఆధిక్యంలో నిలిచింది. అయితే, వరుస పొరపాట్ల వల్ల ఐదు పాయింట్లు కోల్పోయి తొలి గేమ్‌ను ప్రత్యర్థికి చేజార్చుకుంది. ఆ తర్వాత రెండో, మూడో గేమ్‌లలో అస్మిత ఎంతో ఓర్పుగా ఆడింది.
గాలి వీచే దిశను (డ్రిఫ్ట్) సరిగ్గా అంచనా వేసి, కోర్టుపై పూర్తి నియంత్రణ సాధించింది. కీలక సమయాల్లో పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఈ కొరియా మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా అస్మిత రికార్డుల్లోకెక్కింది. ఈ గెలుపు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లు గెలవడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది.
కోర్టులో పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవడమే తన విజయానికి కారణమని వివరించింది. గతంలో సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి దిగ్గజాలు ఈ స్థాయి టైటిళ్లను గెలుచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేవిక సిహాగ్ థాయిలాండ్ మాస్టర్స్, గత వారం తన్వి శర్మ చైనీస్ తైపీ ఓపెన్ గెలుచుకున్నారు.

