కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం పొలిటికల్ హీట్ ని పెంచింది. ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరడంపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth) ఆమె లేఖ రాశారు. మూడు పేజీల లేఖ రాస్తూ కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు.
తమ శాఖ పరిధిలోని అధికారులతో కడియం శ్రీహరి ఎలా మీటింగ్ నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి సమీక్ష చేపట్టారని.. రూల్స్ ఆఫ్ బిజినెస్ కు వ్యతిరేకంగా వ్యహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖలో ఒక ఎమ్మెల్యే జోక్యం సరికాదని.. తక్షణం కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశం కాబట్టి క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపి కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రుల రాజ్యాంగబద్ధ అధికారాలను గౌరవించే విధంగా కడియం శ్రీహరికి మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు..
అటు ఇప్పటికే కడియం శ్రీహరిపై మంత్రి సురేఖ కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా దేవాదాయ శాఖ కమిషనర్‌తో కడియం శ్రీహరి ఎండోమెంట్ రివ్యూ నిర్వహించారని.. తక్షణం అతనిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీని కోరారు. స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో కడియం శ్రీహరి రివ్యూ చేశారని తెలిపారు. దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై ఫిర్యాదు చేశారు.
అయితే తనకు చెప్పకుండా హైకమాండ్‌కి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. హైకమాండ్‌కు రాసిన లేఖను బహిర్గత పరచొద్దని మంత్రి కొండా సురేఖకు మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే వీరు పలుమార్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇటీవల వీరి మధ్య సయోధ్య కుదరటంతో అంతా ప్రశాంతంగా ఉంటుందని పార్టీ వర్గాలు భావించినా.. తాజా వివాదం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది.

