కలం, నిర్మల్ బ్యూరో: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు (Rains) కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంటల సాగుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణ దేవుడి కరుణ కోసం నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్‌పూర్ మండలం కదిలి గ్రామస్తులు వినూత్నంగా పూజలు నిర్వహించారు. గ్రామంలోని పురాతన ప్రసిద్ధ మాతన్నపూర్ణ కదిలే పాపారేశ్వర ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి జలాభిషేకం చేశారు.
ఉదయం ఆలయంలో పండితులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పవిత్ర గోదావరి జలాలతోపాటు ఆలయ ఆవరణలోని కోనేటి నీటితో శివలింగానికి అభిషేకం చేశారు. ఆలయ గర్భగుడిలో నీరు నింపి స్వామివారికి నీరాజనం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, చెరువులు నిండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, రైతుల కష్టాలు తొలగాలని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని గ్రామస్తులు తెలిపారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!
Follow Us On: Instagram

