కలం, వెబ్ డెస్క్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కడప (Kadapa)లో సీపీఐ (CPI) ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ప్రధాని మోదీపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఒక బ్యారల్ ధర వంద డాలర్లకు పైగా పెరిగిందన్న కారణంతో ఇప్పుడు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పెంచడం దారుణమన్నారు. రేపటి రోజున ఇది అన్ని రకాల నిత్యావసరాల పైన, వ్యవసాయ ఉత్పత్తులపైన భారం పడి మొత్తం సమాజంపై దీని ప్రభావం పడనుందని చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడిపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలను నియంత్రించడానికి, వాటి ప్రభావం ప్రత్యక్షంగా ప్రజల మీద పడకుండా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని భారత కమ్యునిస్ట్ పార్టీ పదే పదే కోరుతుందని చెప్పారు. ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికలు పూర్తవగానే సామాన్యులపై భారం మోపారంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశ పరిపాలనలో మోడీ సర్కార్ అన్ని రకాలుగా విఫలమైందని మండిపడ్డారు. నిరంతరం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యులను ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు.

