కలం, వెబ్డెస్క్: కొండా సురేఖ (Konda Surekha)ను మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న వార్తలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 5 శాతం ఉన్న రెడ్డిలను 12 మందిని 80 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిని చేసిందని, 50 శాతం బీసీలు, 25 శాతం కాపులు, 90 శాతం బలహీన వర్గాలున్నా ఎవరిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని ప్రశ్నించారు. కొండా సురేఖ కూతురు సీఎంను విమర్శిస్తే ఆమె మంత్రి పదవిని తొలగించడం ఏమిటని నిలదీశారు.
గతంలో జగ్గారెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డిని రూ.50 కోట్లు ఇచ్చి మంత్రి పదవి తీసుకున్నావని ఆరోపించారని గుర్తు చేశారు. అలాగే కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా ఎన్నో సార్లు బహిరంగంగా సీఎంపై విమర్శలు చేశారని తెలిపారు. మరి వాళ్ల పదవులు ఎందుకు పోవని ప్రశ్నించారు. ఒక మహిళ, ఒక బీసీ, ఒక కాపు అయినందుకే ఆమెపై చర్యలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా కానీ, బీసీ, కాపు నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. పార్టీలు పెట్టడం ప్యాకేజీలకు అమ్ముడు పోవడం మారడం లేదన్నారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కావాలంటే ప్రజా శాంతి పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కొండా సురేఖ ఇతర పార్టీల్లో చేరకుండా ప్రజా శాంతి పార్టీలోనే చేరాలని కోరారు.

