సామినేని రామారావు ఆశయ సాధనకు పోరాడుతాం: సీపీఎం

కలం, కారేపల్లి: సీపీఎం సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, పాతర్లపాడు మాజీ సర్పంచ్ కామ్రేడ్ సామినేని రామారావు మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం సీపీఎం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కమిటీ (CPM Singareni Mandal Committee) ఆధ్వర్యంలో నిర్వహించారు. సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కే. నరేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సామినేని రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సామినేని రామారావు (Samineni Rama Rao) రైతుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకుడని కొనియాడారు. పాతర్లపాడు సర్పంచ్‌గా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తన సొంత భూమిని గ్రామ ప్రజలకు ఇంటి స్థలాల కోసం అందించి ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.

సామినేని రామారావు హత్య కేసులో అసలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారాన్ని ఉపయోగించి కేసును పక్కదారి పట్టిస్తున్నారంటూ నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ పాత్రపైనా విమర్శలు చేశారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి అసలు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తలారి దేవప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యురాలు కొండబోయిన ఉమావతి, సీనియర్ నాయకులు ముక్కా సీతారాములు, ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు, మేకల రమేష్, మంద శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>