పాలకులు పేదల భూములను లాక్కుంటున్నారు : జాన్ వెస్లీ

కలం, నల్లగొండ బ్యూరో : దున్నే వాడిదే భూమి అనే నినాదంతో 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘటన ఎర్రజెండాదేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) అన్నారు. ఆదివారం కట్టంగూరు (Kattangur) మండలంలోని చెరువుఅన్నారం గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట అమరులు పసునూరి వెంకటరెడ్డి, ముసుకు వెంకటరెడ్డిల స్మారక స్తూపాలకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. పీడిత ప్రజల విముక్తి, వెట్టి చాకిరి నిర్మూలన కోసం జరిగిన ఆ పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. నాటి పోరాట స్ఫూర్తినే ఆదర్శంగా తీసుకుని నేటి తరాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి పాలకులు పేదల భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. నాటి పోరాటంలో 3 వేల గ్రామాలకు విముక్తి కల్పించి గ్రామ రాజ్యాలను నెలకొల్పారని గుర్తు చేశారు.

ఆ పోరాటం కేవలం భూముల పంపిణీతో పరిమితం కాకుండా సామాజిక న్యాయం, సమానత్వం కోసం సాగిన మహత్తర ఉద్యమమన్నారు. రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యువకులు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన త్యాగాలను స్మరించుకుంటూ.. అమరుల స్ఫూర్తి నేటికీ ప్రజా ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తుందని జాన్ వెస్లీ (John Wesley) పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, కూలీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సంఘటిత పోరాటాలే మార్గమని తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలతో సమ సమాజం సాధ్యమవుతుందని, సోషలిస్టు వ్యవస్థ ద్వారానే అసమానతలు తొలగుతాయని చెప్పారు. ప్రభుత్వాలు పోలీసు, అధికార వ్యవస్థలను అడ్డంగా పెట్టుకుని ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే, మరింత బలంగా ప్రతిఘటన వ్యక్తమవుతుందని హెచ్చరించారు.

అణచివేతలు ఉన్నంతకాలం తిరుగుబాటు తప్పదని, తెలంగాణ సాయుధ పోరాటమే దీనికి సాక్ష్యమని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో పాలక వర్గాలు దోపిడి వర్గాలకు అనుకూలంగా పనిచేస్తున్నాయని జాన్ వెస్లీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, బొజ్జ చిన్నవెంకులు, రాచకొండ వెంకన్న గౌడ్, నాయకులు చిలుముల రామస్వామి, గడగోజు రవీంద్రాచారి, శాఖ కార్యదర్శులు గద్దపాటి సుధాకర్, గంట వెంకన్న, మాజీ జెడ్పీటీసీ చిలుముల హేమంతయ్య, నకిరేకల్ మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, కక్కిరేణి రామస్వామి, రెడ్డిమళ్ల బిక్షం, పొన్న అంజయ్య, శ్రీను, సురేష్, మల్లేష్, స్టాలిన్, యాదయ్య, అనంతరెడ్డి, ఇటికాల సురేందర్, సుధీర్, రామకృష్ణ, లింగయ్య, ఆంజనేయులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>