గోనుపాడును క‌మ్మేస్తున్న డంప్‌యార్డ్ కాలుష్యం

క‌లం, జోగులాంబ గ‌ద్వాల‌: గద్వాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన మున్సిపల్‌ అధికారులు పర్యావరణ పరిరక్షణను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల నుంచి సేకరించిన చెత్తను గద్వాల మండలం గోనుపాడు (Gonpad) గ్రామ శివారులోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ పేరుకుపోతున్న చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో శుద్ధి చేసి, రీసైక్లింగ్‌ చేయాల్సి ఉండగా.. తగలబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వెలువడుతున్న దట్టమైన పొగ, దుర్వాసన పరిసర ప్రాంతాలను కమ్ముకుంటున్నాయి. ఫలితంగా గోనుపాడు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పేరుకుపోతున్నా ప‌ట్టించుకోరా..?

మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజూ పెద్దఎత్తున చెత్త సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. అయితే అక్కడ వ్యర్థాలను వేరు చేయడం, రీసైక్లింగ్‌ చేయడం, తడి చెత్తను ఎరువుగా మార్చడం వంటి ప్రక్రియలు ఆశించిన స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో రోజురోజుకూ చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి. పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తగలబెడుతున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

పొగ, దుర్వాసనతో అవస్థలు

చెత్తను కాల్చడంతో వెలువడే పొగ గ్రామ పరిసరాలను కమ్మేస్తోంది. దుర్వాసనతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఒకవైపు రోడ్లపై చెత్తను కాల్చవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే అధికారులు, మరోవైపు డంపింగ్‌ యార్డులో చెత్త దహనాన్ని ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఇదేనా పరిశుభ్రత?

పట్టణ పరిశుభ్రత పేరుతో సేకరించిన చెత్తను గ్రామ శివారులో కాల్చి ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు కలిగించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి చెత్త దహనాన్ని నిలిపివేయాలని, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని గోనుపాడు గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారా? లేక ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>