కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక కేంద్రమైన కరీంనగర్ వేదికగా బీజేపీ భారీ బలప్రదర్శనకు సిద్ధమైంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) తొలిసారి కరీంనగర్‌కు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సారథ్యంలో సోమవారం నిర్వహించనున్న ‘మహా పాదయాత్ర’కు (BJP Maha Padayatra) ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్ష మందికి పైగా ప్రజలను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నితిన్ నబీన్ పర్యటన ఏర్పాట్లను బండి సంజయ్ గత రెండు రోజులుగా కరీంనగర్లో ఉండి పర్యవేక్షించారు. నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లను కాషాయ తోరణాలు, జెండాలు, భారీ కటౌట్లు, హోర్డింగులతో అలంకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా బస్సులు, 500 మినీ బస్సులు, వ్యాన్లు, 2 వేల ఆటోలను సమీకరణ కోసం సిద్ధం చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా డప్పు నృత్యాలు, కళా ప్రదర్శనలతో జాతీయ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలకనున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లతో పాటు దారిపొడవునా మంచినీరు, తినుబండారాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.
సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకోనున్న నితిన్ నబీన్, అక్కడి నుంచి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని మహా పాదయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం వైశ్యా భవన్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, గడియారం సెంటర్, శాస్త్రీ రోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం 4.30 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి బయలుదేరుతారు.
ఈ పాదయాత్రకు జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ ప్రాధాన్యత ఉందని బండి సంజయ్ తెలిపారు. ‘సర్’ పేరుతో రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగా ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం- అరాచకాన్ని అంతం చేద్దాం’ నినాదంతో దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో బీజేపీ ర్యాలీలు నిర్వహిస్తోందని చెప్పారు. వాటిలో కరీంనగర్ మహా పాదయాత్ర కీలకంగా నిలుస్తుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తమ బలాన్ని చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంతో పాటు, అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్‌ను ఆకర్షించడం లక్ష్యంగా బీజేపీ ఈ యాత్రను కీలక వేదికగా మలుచుకుంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

