కలం, ఖమ్మం బ్యూరో : ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్న భద్రాచలం ఎమ్మెల్యే పీఏ (Bhadrachalam MLA PA) కల్యాణ్ కుమార్ అక్రమాల తీగ లాగితే డొంకంతా కదులుతోంది. రూ.10 కోట్ల మేర సాగిన ఈ భారీ ఉద్యోగాల మోసం వెలుగులోకి రావడంతో భద్రాచలం పోలీసులు కల్యాణ్ కుమార్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి, ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తును వేగవంతం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు ఐటీసీ, జెన్కో వంటి ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన కల్యాణ్ కుమార్ ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుండి రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులను నమ్మించడానికి సదరు సంస్థల నకిలీ లెటర్ హెడ్లు, ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశాడు.
ఎమ్మెల్యే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారినందున ప్రభుత్వంలో ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ కోట్ల రూపాయలు కాజేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటపడటంతో నిందితుడు కల్యాణ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేయగా, అతడి స్వస్థలమైన మణుగూరుతో పాటు శ్రీకాకుళంలో ఉన్న ఆస్తుల వివరాలను, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు ఈ మోసంపై భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పందిస్తూ, తన పేరును దుర్వినియోగం చేస్తూ పీఏ కల్యాణ్ కుమార్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడని, ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సదరు పీఏను వెంటనే విధుల నుంచి తప్పించాలని కలెక్టర్‌కు లేఖ రాయడంతో పాటు, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

