కలం, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు (Mellacheruvu) మండలం ఎర్రగట్టు తండా(Yerragattu Thanda)లో వేపచెట్టు వివాదంతో జరిగిన హత్యల వ్యహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందు వేపచెట్టు విషయమై మొదలైన గొడవతో ఇరు వర్గాల వారు గొడ్డలితో దాడి చేసుకున్నట్లు తెలిసింది. కానీ, ఈ ఇద్దరినీ ఒకే వ్యక్తి హత్య చేశాడని, మృతుల్లో ఒక వ్యక్తి కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..
ఎర్రగట్టు తండా(Yerragattu Thanda)లో వేపచెట్టు వ్యవహారంలో జరిగిన గొడవతో రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో వేంకటేశ్వర్లు యాదవ్, సైదా అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే వీరిద్దరినీ సైదా కొడుకు రామ్ నాయక్ చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. రామ్ నాయక్ గొడ్డలితో వేంకటేశ్వర్లు యాదవ్‌పై దాడికి ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన తండ్రి సైదా పైనా దాడి చేశాడు. రామ్ నాయక్ దాడిలో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రామ్ నాయక్ కొత్త డ్రామాకు తెరలేపాడు. వేంకటేశ్వర్లు తన తండ్రిని గొడ్డలితో నరికి చంపాడని, అందుకే అతడ్ని నరికి చంపానని చెప్పుకొచ్చాడు. మొదట్లో అందరూ ఇదే విషయాన్ని నమ్మారు.
కానీ, కొన్ని గంటలకే అసలు విషయం బయటపడింది. నిజం తెలియడంతో వేంకటేశ్వర్లు యాదవ్ బంధువులు రామ్ నాయక్ ఇంటిపై దాడికి యత్నించారు. కానీ, అప్పటికే రామ్ నాయక్ పరారయ్యాడు. గ్రామస్తులను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై వేంకటేశ్వర్లు వర్గం వారు రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ఎస్సై నవీన్‌కు గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల విచారణలో రామ్ నాయక్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామ్ నాయక్ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. అతడి ప్రవర్తనతో భార్య విడాకులు తీసుకుంది. అలాగే ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. గ్రామంలో అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడని పోలీసులు వెల్లడించారు. దాదాపు 90 శాతం గ్రామస్తులపై రామ్ నాయక్ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ జంట హత్యలపై కేసు నమోదు చేసుకొని రామ్ నాయక్ తల్లి, సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రామ్ నాయక్ కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
Also Read : ప్రోటోకాల్ రగడ.. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్
Follow Us On: Instagram

