కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) పోచమ్మ గల్లీలోని ముదిరాజ్ వీధిలో ఈర్ల శేఖర్ (Irla Shekhar) నివాసాన్ని ఆదే ప్రవీణ్ కుమార్ (Aade Praveen Kumar) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు బృందం సందర్శించింది. కోనేరు సాయికుమార్, కరిపే రాజు, తుమ్మ నాగభూషణం, పాశుగంటి మహేష్, స్వర్గం రమేష్ తదితరులతో ఆదే ప్రవీణ్ కుమార్ కల్సి దాదాపు సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారులు ఈర్ల శేఖర్‌ను పరామర్శించారు.
ఈ సందర్భంగా మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన నిధులు – స్వరాష్టమే నా జన్మ హక్కు అంటూ జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఈర్ల శేఖర్ నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమై ఉన్నాడు. ఆయన ఆర్థిక పరిస్థితిని గమనించి ఆదే ప్రవీణ్ కుమార్ రెండు నెలలకు సరిపడా బియ్యము, పప్పులు, నిత్యావసర వస్తువులు అందించారు.
ఈ సందర్భంగా ఆదే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఎందరో మందిలో ఈర్ల శేఖర్ మొదటి స్థానంలో ఉన్నారని, ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తొమ్మిదిన్నర యేండ్లకు పైగా అధికారంలో వున్నా పాత టీఆర్ఎస్ (కొత్త బీఆర్ఎస్) పార్టీతో ఏర్పడిన ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్‌లో పేద ప్రజలకూ ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇక్కడ ఇవ్వలేదని, ఒక్క ఉద్యమకారుడికి కూడా న్యాయం జరగకపోవడం వల్ల తాను ఇప్పుడు ఇరుకు రూములో జీవనం గడుపుతున్నారని విమర్శించారు.
ఆయనకు ప్రభుత్వం తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని, బస్సు ఫ్రీ లాంటి సౌకర్యాలు కల్పించాలని, వారి చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులలో సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని, మేనిపెస్టో లో పెట్టినట్టు ప్రతీ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం ఇవ్వాలనీ ఈ సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఉద్యమకారులు ప్రస్తుతం చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారని, ఈ దయనీయ స్థితి నుంచి ఉద్యమకారులను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని విన్నవించారు. ఉద్యమంలో పోలీసుల లాఠీ దెబ్బలను, వాటర్ కాన్వాయ్ లను ధైర్యంగా ఎదుర్కొని నిలిచినటువంటి ఈర్ల శేఖర్ లాంటి వారిని ఆదుకొని ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పై ఉందని అన్నారు.

