కలం, నల్లగొండ: ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్యాబినెట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, పునర్వ్యవస్థీకరణ ద్వారానే ప్రభుత్వంలో కొత్తదనం వస్తుందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అభిప్రాయపడ్డారు.శనివారం ఆయన మీడియాతో చేసిన చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తయింది. మంత్రివర్గంలో మార్పులు రావాలి, ఉన్న క్యాబినెట్‌ను రీషఫుల్ చేయాలి. పునర్వ్యవస్థీకరణ చేస్తేనే పాలనలో కొత్తదనం వస్తుంది” అని గుత్తా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏ పార్టీలోనూ క్రమశిక్షణ లేదని, అధికార కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ‘పార్టీ లైన్ దాటిన వారిపై వెంటనే వేటు వేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. లీకేజీలను కంట్రోల్ చేయాలి. చిన్నారెడ్డిలాంటి సీనియర్లు ఓపెన్ గా మాట్లాడకుండా ఉండాల్సింది. పార్టీ లైన్ దాటడం సరికాదు’ అని హెచ్చరించారు. క్రమశిక్షణను కాపాడుకుంటే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును ప్రశంసిస్తూనే ఆయనకు అందరూ సహకరించాలని గుత్తా కోరారు. “రేవంత్ రెడ్డి యువకుడు, ఎంతో ఉత్సాహవంతుడు. ఆయనను స్వేచ్ఛగా పని చేయనివ్వాలి. ఆయనకు ఎవరూ ఆటంకాలు సృష్టించకూడదు” అని వ్యాఖ్యానించారు.
పాలనలో ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఉండాలని, పార్టీ నేతలందరూ ఆయనకు సహకరించాలని గుత్తా పిలుపునిచ్చారు. “సంక్షేమ పథకాల పరిధిలో ఉచితాలను తగ్గించాలి. కేవలం జెన్యూన్ (అర్హులైన) లబ్ధిదారులకు మాత్రమే పథకాలు అందాలి. బీపీఎల్, ఏపీఎల్ ప్రాతిపదికన వర్గీకరణ చేయాలని గతంలోనే సూచించాను” అని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను కనీసం రూ. 4వేలకు పెంచాలని, ఏడాదికి నాలుగు పంటలకు వర్తించేలా ‘రైతు భరోసా’ను కంటిన్యూ చేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో భూములపై విధించిన ’22ఏ’ నిషేధిత జాబితాను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పాత పథకాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ కొత్త పథకాలను తెచ్చిందని, ప్రజల్లో వీటిపై అసంతృప్తి లేదన్నారు. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పాలనలో, పదవుల్లో తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

