కలం, చండూరు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. శనివారం చండూరు మండలం కేంద్రంలో జైల్ భరో (Jail Bharo) కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయన్నారు.
విద్యుత్ సవరణ బిల్లుతో రైతులపై అదనపు భారం పడుతుందని, వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు పెంచడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు ఐక్యంగా పోరాడితేనే ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, ఐకెపి వివో ఏ, ఫీల్డ్ అసిస్టెంట్ ఆరోగ్యశాఖల లో వివిధ స్కీంలో కోటి మంది వర్కర్లు పనిచేస్తున్నారని, వీరికి ఉద్యోగ భద్రత, కనీస వేతనానికి నోచుకునే స్థితి లేదన్నారు. లేబర్ కోడ్స్ అమలయితే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు కార్మిక వర్గం కోల్పోతామని, నాలుగు లేబర్ కోడ్ లు ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాలని బండ శ్రీశైలం పిలుపునిచ్చారు.
అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ లతో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను చేసుకున్నదని, భారత వ్యవసాయ రంగంలోకి 32 దేశాల నుండి దిగుమతులను ప్రోత్సహించిందని, జీరో సుంకంతో దిగుమతులు రావడంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోయి రైతులు దివాలా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జెర్రిపోతుల ధనంజయ, సిఐటియు సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్ బల్లెం స్వామి, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, వెంకన్న, నగేష్, సైదులు, అంజి, జగన్, లింగస్వామి, బిక్షం, విజయ్, నరసింహ, బన్నీ, రమేష్, కుమార్, శివ, రాములు తదితరులు పాల్గొన్నారు.

