కలం, స్పోర్ట్స్: గాయం కారణంగా కీలక టోర్నీలకు దూరమైన భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనకు ప్రకటించిన మూడు ఫార్మాట్ల జట్లలోనూ ఆమెకు చోటు దక్కింది. మరోవైపు వెన్నునొప్పి నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్‌కు టీ20 జట్టులో అవకాశం కల్పించారు. డిసెంబర్ 9 నుంచి 30 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇంగ్లండ్‌లో జరిగిన ది హండ్రెడ్ టోర్నీలో జెమీమా తొడ కండరాల గాయానికి గురైంది.
దీంతో ఆసియా కప్, ఆసియా క్రీడలు, జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లకు దూరమైంది. మూడు నెలల చికిత్స తర్వాత నవంబర్ 2న సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ద్వారా మైదానంలోకి తిరిగొచ్చింది. ముంబై తరఫున ఆడుతూ మంచి ప్రదర్శన చేసింది. ఢిల్లీపై 58 పరుగులు చేయడంతో పాటు పుదుచ్చేరిపై 47 బంతుల్లో 107 పరుగులతో అదరగొట్టింది. దీంతో ఆమెకు మళ్లీ భారత జట్టులో చోటు దక్కింది. మరోవైపు దక్షిణాఫ్రికాతో ఈ ఏడాది జరిగిన టీ20 సిరీస్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమైన అమన్‌జోత్ కూడా తిరిగి జట్టులోకి వచ్చింది.
ఈ పర్యటనలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. స్మృతి మంధాన తొలిసారి భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మూడు ఫార్మాట్లలోనూ ఆమెనే జట్టును నడిపించనుంది. టెస్టు జట్టుకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, టీ20లకు షఫాలీ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. టెస్టు జట్టులో ఉమా ఛేత్రిని తప్పించి జింటిమణి కలితకు అవకాశం ఇచ్చారు.
టీ20 జట్టులో జెమీమా, అమన్‌జోత్ రాకతో మిన్ను మణి, జింటిమణి కలితకు చోటు దక్కలేదు. డిసెంబర్ 9 నుంచి గెబెర్హాలో ఏకైక టెస్టుతో పర్యటన ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. డిసెంబర్ 26న తొలి టీ20 జరగనుండగా, చివరి రెండు మ్యాచ్‌లు 29, 30 తేదీల్లో జరుగుతాయి. ఈ పర్యటనకు బీసీసీఐ మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ప్రకటించింది.

