కలం, వనపర్తి: విక్షత్ భారత్-రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) గ్యారంటీ (విబి-జి రామ్ జి) ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రజా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి(Wanaparthy)లో జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన విబి-జి రామ్ జి ఉద్యోగులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ దివ్యతో పాటు సీఎంఓ అధికారి శ్రీధర్తో ఫోన్లో మాట్లాడి ఉద్యోగుల సమస్యలను వివరించారు. పెండింగ్ వేతనాల తక్షణ విడుదల, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, పదోన్నతులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీ వంటి అంశాల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అధికారులు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఒక్క పే స్కేల్ అమలు అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు.
రూరల్ డెవలప్మెంట్లో ఐకేపీ, విబి-జి రామ్ జి ఉద్యోగులు రెండు కళ్లలాగా పనిచేస్తున్నారని, ఐకేపీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసి వీరికి ఇవ్వకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు తన పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ కన్వీనర్ బాలయ్య, కో-కన్వీనర్ కోళ్ల సత్తన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, ఉద్యోగులు భాస్కర్, రామస్వామి, ముఖీద్తో పాటు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఏపీఓలు, ఈసీఎస్లు, టీఏలు, బీఎఫ్టీలూ, సీఓలు పాల్గొన్నారు.

