కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఎంతమంది నేతలు బుజ్జగించినా ఆయన తగ్గేదేలేదంటున్నారు. 43 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి చివరకు బ్రేకప్ చెప్పేస్తున్నారు. తాను పార్టీలో ఇమిడే పరిస్థితి లేదని.. తన సమస్యకు అసలు పరిష్కారం లేదని ఆయన పదే పదే అంటున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి జరిపిన చర్చలు సక్సెస్ కాలేదు. తనకు పార్టీలో తీవ్ర అవమానం, పరాభావం జరిగాయని ఆయన నేతల వద్ద చెప్పుకున్నట్టు సమాచారం. తాను పార్టీ మారడం ఖాయమని.. ఇదే తనకు పార్టీలో ఆఖరి రోజు అని కార్యకర్తల దగ్గర జీవన్ రెడ్డి వాపోయారు.
కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ
జీవన్ రెడ్డి పార్టీని వీడితే జగిత్యాల జిల్లాలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచారు. సుమారు 43 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ మంత్రులు జువ్వాడి రత్నాకర్ రావు, చొక్కారావు, ఎం సత్యనారాయణరావు వంటి సీనియర్ నేతలతో కలిసి పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సైతం సన్నిహితంగా ఉన్నారు. కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన ఇంటికి పెట్టిన ఇందిరాభవన్ అనే పేరును సైతం తొలగించారు. ఇందిరాభవన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలను తీసివేయించారు. కాంగ్రెస్ కండువాను కప్పుకునేందుకు నేతల ముందే విముఖత చూపారు. ఈ నెల 25న (బుధవారం) కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం బలంగా ఉంది.
అసలేం జరిగింది?
జీవన్ రెడ్డి 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పని చేశారు. టీడీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం జీవన్ రెడ్డికి రుచించలేదు. 2014లో జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్.. ఆ తర్వాత జరిగిన 2018, 2023 ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించారు. తన ప్రత్యర్థికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన తన ఆత్మగౌరవానికి దెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం, గౌరవం దక్కడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కూడా ఆయన సూచనలను పట్టించుకోలేదని సమాచారం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం వస్తుందని ఆశించినా, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఆయనను బాధించిందని సమాచారం.
సంజయ్ తీరుతో ఇబ్బందులు
ఎమ్మెల్యే సంజయ్ సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా .. ఆయన అనధికారికంగా ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన మాటే చెల్లుబాటు అవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ జగిత్యాలలో కాస్త తీవ్రరూపం దాల్చింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగిత్యాల కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ స్థానాలు ఇచ్చి తన వర్గానికి తక్కువ స్థానాలు ఇచ్చారనే కోపంతో జీవన్ రెడ్డి తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు జీవన్ రెడ్డికి మధ్య ఏర్పడిన విభేదాలను తగ్గించేందుకు పలు సందర్భాల్లో మంత్రుల కమిటీ రంగంలోకి దిగినా ఇష్యూ పరిష్కారం కావడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కుతుందని జీవన్ రెడ్డి ఆశించారు. కానీ చివరకు సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ గా ఎన్నిక కావడంతో జీవన్ రెడ్డి అసహానానికి గురైనట్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు.
పార్టీ క్యాడర్ అయోమయం
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో రాజకీయంగా అయోమయం నెలకొంది. దశాబ్దాలుగా ఆయన వెంట ఉన్న పార్టీ క్యాడర్ కాంగ్రెస్ పట్ల విశ్వాసం చూపుతుందా? లేదంటే జీవన్ రెడ్డి అనుచరులంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా? అన్నది వేచి చూడాలి. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత వెళ్లిపోవడం జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్‌కు కొంత నష్టమే. నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న క్యాడర్ ఆయన వెంటే వెళ్లే అవకాశం ఉంది. వ్యక్తిగత అనుబంధం ఒక వైపు, అధికార పార్టీలో కొనసాగితే లభించే రాజకీయ అవకాశాలు మరోవైపు ఉండడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. జగిత్యాల రాజకీయల్లో అనిశ్చితి పెరగడంతో కార్యకర్తలు, అనుచరులు ఎటువైపు వెళ్లాలన్న దానిపై సందిగ్దంలో పడిపోయారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కాంగ్రెస్‌లో చీలికలు కచ్చితంగా ఉంటాయనేది స్పష్టమవుతుంది. ఎమ్మెల్యే సంజయ్ క్యాడర్ సైతం బలబలాలను సమానం చేస్తోంది. అయితే, పార్టీలో మారుతున్న సమీకరణాల దృష్ట్యా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా 25న బుధవారం జగిత్యాల వేదికగా జీవన్ రెడ్డి నిర్వహించనున్న సమావేశం ఈ పరిణామాల నేపథ్యంలో జగిత్యాలలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఆయన పరోక్షంగా బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సంకేతాలివ్వడంతో స్థానిక రాజకీయాల దిశను మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

