బీజేపీ పాలనకు చరమగీతం తప్పదు: చాడ వెంకటరెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: దేశంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ప్రచార జాతా పాదయాత్ర నిర్వహిస్తోందని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలే ఆ పార్టీ పతనానికి దారితీస్తాయని సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) అన్నారు. దేశంలో మార్పు కోసం సిపిఐ నిరంతరం పోరాటం సాగిస్తోందని తెలిపారు. శనివారం ప్రచార జాతా పాదయాత్ర మూడో రోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో కొనసాగింది. అమ్మనగుర్తిలో ప్రారంభమైన పాదయాత్ర బొమ్మకల్, రాయికల్, ఘన్‌పూర్, ఆకునూర్, గొల్లగూడెం మీదుగా సర్దార్ సర్వాయి పాపన్న సర్వాయిపేట గడీల వరకు ఉత్సాహంగా సాగింది.

బీజేపీ పాలన ప్రజా వ్యతిరేకం: చాడ

యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. బీజేపీ 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని చేసిందా అని ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం క్రమంగా దెబ్బతీస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, సాధారణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు, అదానీ, అంబానీలకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.

ధరలు తగ్గించాలి.. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తక్షణమే నియంత్రించాలని చాడ డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, విద్య, వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని, మహిళా రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, దళితులు, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 1న ఢిల్లీలో మహా ర్యాలీ

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6 నుంచి దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు. వివిధ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో పర్యటిస్తూ అట్టడుగు వర్గాల ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ పాదయాత్రలు సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే ‘దేశంలో మార్పు కోసం’ మహా ర్యాలీతో ముగుస్తాయని తెలిపారు. సీపీఐ ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి అందే స్వామి, పొన్నగంటి కేదారి, బోయిని అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, గూడెం లక్ష్మి, మండల పార్టీ కార్యదర్శి లంకదాసరి కళ్యాణ్, ఓజ్జా కొమురయ్య, కొమ్ముల సమ్మయ్య, నలువాల రవీందర్, జడల రాజేశం, పుట్ట సంపత్, బొల్లి శ్రీనివాస్, బొల్లి రాజేష్, భాషవేణి సురేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు, వివిధ గ్రామాల సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>