ప్లస్సా.. మైనస్సా.. జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై కొత్త చర్చ

కలం, తెలంగాణ బ్యూరో : దీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (Jeevan Reddy) తెగతెంపులు చేసుకుని బీఆర్ఎస్‌లో చేరడానికి గ్రౌండ్ రెడీ చేసుకోవడంపై రెండు పార్టీల్లోనూ చర్చ మొదలైంది. ఆయన చేరికతో కాంగ్రెస్ ఒక తలనొప్పిని వదిలించుకున్నదా?.. బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ అవుతుందా? ఇలాంటివన్నీ ఆ రెండు పార్టీల నేతల్లో చర్చగా మారాయి. జీవన్‌రెడ్డి తాజా నిర్ణయంతో ఏ పార్టీ నేతల అభిప్రాయం వారికున్నది. కాంగ్రెస్‌కు నెగెటివ్ అవుతుందనే అభిప్రాయం కొందరిదైతే బీఆర్ఎస్‌కు కొత్త జోష్ వచ్చినట్లయిందని మరికొందరి వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకోవాలన్నదే జీవన్‌రెడ్డి ఆలోచన అని, అందుకే పార్టీ మారారన్నది ఆ నియోజకవర్గ ప్రజల్లో నెలకొన్న సాధారణ అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో జీవన్‌రెడ్డి నిర్ణయం ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్ అనేది ఆసక్తికరంగా మారింది.

మరో ‘పొన్నాల’గా మారనున్న జీవన్‌రెడ్డి :

జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌లో కొనసాగినప్పుడు ఉన్నంత ప్రజాదరణ ఇప్పుడు లేదని, బీఆర్ఎస్‌లో చేరినా ఆయన వల్ల పార్టీకి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదన్నది గులాబీ శ్రేణుల అభిప్రాయం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ను విడిచి బీఆర్ఎస్‌లోకి రావడం వెనక ఆయన స్వప్రయోజనం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఆదరణ ఉన్నట్లయితే గత ఎన్నికల్లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారని గుర్తుచేశారు. దీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌తో కొనసాగిన పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పార్టీకి కలిసొచ్చిందేమీ లేదని, ఇప్పుడు జీవన్‌రెడ్డి పరిణామం కూడా అలాంటిదేనన్నది గులాబీ శ్రేణుల భావన. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటు బ్యాంకేమీ లేదని, గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి, బీఆర్ఎస్ తరఫున గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మధ్య ఓట్ల తేడా కేవలం 15 వేలేనని గుర్తుచేశారు.

రెండేండ్లుగా వివాదం సమసిపోయిందన్న కాంగ్రెస్ :

జీవన్‌రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీఆర్ఎస్‌లో చేరాలన్న ఆలోచన ఉన్నప్పుడే పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్, సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన డాక్టర్ సంజయ్ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జీవన్‌రెడ్డికి అసంతృప్తి మొదలైంది. వీరిద్దరి మధ్య గ్యాప్ తగ్గించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. జీవన్‌రెడ్డిని పార్టీ నుంచి దూరం కాకుండా ఉండేలా కన్విన్స్ చేసినా ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు తలెత్తడం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికీ ఒక దశలో చికాకు కలిగించింది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్‌లోకి వెళ్ళడం ద్వారా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నది హస్తం శ్రేణుల భావన. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రజాదరణను కోల్పోతున్న సమయంలో జీవన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన పొలిటికల్ కెరీర్‌కు ఉపయోగపడదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసినా గెలిచే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పార్టీలు మారినా.. మళ్లీ ఇద్దరి మధ్య పోటీ :

జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవచ్చనేది ఆయనతో పాటు పార్టీ నేతల భావన. ఓడిపోయిన వ్యక్తులకు టికెట్ ఇచ్చే విషయంలో ఏఐసీసీ ఈసారి స్పష్టమైన విధానంతో ఉంటుందనే సంకేతాలు పార్టీలో ఇప్పటికే నెలకొన్నాయి. ఎలాగూ టికెట్ రాదనే భావనతోనే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్ళారనే వాదన లేకపోలేదు. ఒకవేళ ఆ నియోజకవర్గం మహిళలకు రిజర్వు అయితే ఆయన తరపున కోడలు చరిష్మారెడ్డికి బీఆర్ఎస్ తరఫున టికెట్ ఇప్పించుకోవచ్చనే ఆలోచన ఉన్నట్లు స్థానిక ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం. కేవలం టికెట్ కోసమే పార్టీ మారారని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు తప్పదన్నారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీపడినట్లుగానే వచ్చే ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యనే పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. కాకపోతే ఈసారి ఈ ఇద్దరి పార్టీలు మాత్రం ఆటూ ఇటూ మారాయని గుర్తుచేశారు.

బీఆర్ఎస్‌లోనూ పాత కొత్త ఘర్షణలు తప్పవా? :

జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో పాత-కొత్త లీడర్ల ఘర్షణ తప్పకపోవచ్చనే అభిప్రాయం కూడా గులీబీ లీడర్ ఒకరు వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి చెందిన ఎల్.రమణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా పూర్తవుతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆసక్తి చూపితే ఇద్దరి మధ్య తలెత్తే మనస్ఫర్ధలను, భేదాభిప్రాయాలను సర్దుబాటు చేయడం గులాబీ పార్టీకి అనివార్యమవుతుంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో ఇప్పుడు డాక్టర్ సంజయ్‌తో నెలకొన్న తరహా వివాదమే బీఆర్ఎస్‌లో ఎల్.రమణతో కంటిన్యూ అయ్యే అవకాశాలు లేకపోలేదని గుర్తుచేశారు. జీవన్‌రెడ్డి రాకతో పార్టీకి అదనంగా ఒనగూరిన ప్రయోజనం లేకపోయినా స్థానికంగా పదేండ్లుగా ఉన్న కార్యకర్తలతో పాటు లీడర్లతోనూ ఘర్షణ వాతావరణం ఉండొచ్చనే అనుమానం పార్టీలో నెలకొన్నది.

Read Also: పాక్ ప్రధానితో అమెరికా ఉపాధ్యక్షుడి భేటీ.. కీలక చర్చలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>