మల్కాజిగిరి మూడు ముక్కలు..డీలిమిటేషన్‌తో మార్పులు!

కలం, తెలంగాణ బ్యూరో: డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అన్ని రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య 50 శాతం నిష్పత్తి చొప్పున పెరగనున్నాయి. ఆ ప్రకారం తెలంగాణలో లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 17 నుంచి 26కు పెరగనున్నాయి. శాసనసభ స్థానాల సంఖ్య 119 నుంచి 176కు పెరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం లభించిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానున్నది.

2029లో జరిగే ఎన్నికల్లో..

డీలిమిటేషన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి లోక్‌సభ, శాసనసభ స్థానాల డిస్ట్రిబ్యూషన్, బౌండరీలను ఖరారు చేయనున్నది. ఇందుకోసం 2011 జనాభా లెక్కల గణాంకాలను పరిగణనలోకి తీసుకోనున్నది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న ‘1971 జనాభా లెక్కల ప్రకారం’ అనే నిబంధనను ‘2051 తర్వాత జరిగే జనగణన వరకు సీజ్’ అని సవరించనున్నది. లోక్ సభ సీట్ల సంఖ్య పెంపుతో పాటే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ విధానం కూడా అమల్లోకి రానున్నది. దీంతో 2029లో జరిగే పార్లమెంటు ఎన్నికలు పెరిగిన సీట్ల సంఖ్య ఆధారంగా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విధానంతో జరగనున్నాయి.

2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక..

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30 నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నది. డీలిమిటేషన్ కమిషన్ బిల్లు ఏర్పాటు కోసం ‘బిల్లు ఆమోదం పొందిన వెంటనే సిద్ధంగా ఉన్న జనగణన వివరాలు ప్రాతిపదిక అవుతాయి..’ అని ఆ బిల్లుల్లో కేంద్రం స్పష్టత ఇచ్చింది. దీంతో 2027 జనాభా లెక్కలు పరిగణనలోకి రావని స్పష్టమైంది. ఈ బిల్లులకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధ్యమైతే డిసెంబరు 3తో ముగిసే సమావేశాల్లోనే ఆమోదం లభిస్తుంది. ఆ వెంటనే రాష్ట్రపతి కూడా ఆమోదం తెలుపుతారు.

కానీ షెడ్యూల్ ప్రకారం 2027 సెన్సస్ ప్రక్రియ మాత్రం వచ్చే ఏడాది మార్చి 5న ముగియనున్నందున గణాంకాలన్నింటినీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి మరికొంత సమయం పట్టే అవకాశమున్నది. దీంతో 2027 సెన్సస్ వివరాలు ప్రస్తుత డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్‌కు ఉపయోగపడవు. లోక్‌సభ స్థానాల డిస్ట్రిబ్యూషన్, బౌండరీల సరిహద్దులు, మండలాల మార్పు, అసెంబ్లీ నియోజకవర్గాల కూర్పు తదితరాలన్నింటికీ తద్వారా 2011 జనాభా లెక్కలే ప్రామాణికం కానున్నాయి.

కొత్త ఎంపీ స్థానాలపై ఉత్కంత..

– లోక్‌సభ స్థానాల డిస్ట్రిబ్యూషన్ కోసం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోనున్నందున రాష్ట్రంలో పెరగనున్న 9 స్థానాలు ఏయే జిల్లాల్లో ఉంటాయనే చర్చ మొదలైంది.
– దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గం మూడు ముక్కలయ్యే అవకాశమున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనూ మూడు కొత్తవి పుట్టుకొచ్చే అవకాశమున్నది.
– ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మంచిర్యాల, జగిత్యాల లేదా పెద్దపల్లి, కొత్తగూడెం లేదా భద్రాచలం, వికారాబాద్ లేదా పరిగి నియోజకవర్గాలు పుట్టుకొచ్చే అవకాశమున్నది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>