కలం, వెబ్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్ (Japan) చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మాంటెర్రే స్టేడియంలో జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో ట్యునీషియాను 4-0 తేడాతో చిత్తు చేసి నాకౌట్ దశకు మరింత చేరువైంది. ఈ విజయంతో జపాన్ ప్రపంచకప్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన ఏ ఆసియా జట్టు కూడా ఒకే మ్యాచ్‌లో నాలుగు గోల్స్ చేయలేదు. ఆ ఘనతను సాధించిన తొలి ఆసియా దేశంగా జపాన్ నిలిచింది. అంతేకాకుండా ప్రపంచకప్ చరిత్రలో జపాన్‌కు ఇదే అతిపెద్ద విజయం. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే డైచి కమాడా గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు.
ఇది ప్రపంచకప్‌లో జపాన్ ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన గోల్‌గా రికార్డుల్లో చేరింది. అనంతరం అయాసే ఉఎడా అద్భుత హెడర్‌తో రెండో గోల్ సాధించాడు. రెండో అర్ధభాగంలో ఉఎడా అందించిన పాస్‌ను జున్యా ఇటో గోల్‌గా మలచి స్కోరును 3-0కు చేర్చాడు. మ్యాచ్ ముగింపుకు ముందు ఉఎడా మరోసారి గోల్ చేసి జపాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన తొలి జపాన్ ఆటగాడిగా కూడా అతడు నిలిచాడు. ఈ విజయంతో జపాన్ గ్రూప్-ఎఫ్లో నెదర్లాండ్స్‌తో సమాన పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ట్యునీషియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

