కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఆమె నిన్న సాయంత్రం కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో మెట్ల మార్గంలో ప్రయాణమయ్యారు.
ఈ యాత్రలో ఆమె వెంట ఒకప్పటి ప్రముఖ నటి మహేశ్వరి కూడా ఉన్నారు. భద్రతా సిబ్బంది నడుమ కాలినడకన కొండపైకి చేరుకున్న జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు ఉదయం విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. జాన్వీ కపూర్ తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. తన తల్లి శ్రీదేవికి ఇష్టమైన ఈ పుణ్యక్షేత్రానికి రావడం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆమె గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

