బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌కు షాకిచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: జ‌న‌సేన (Janasena) నాయ‌కుడు బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌ (Bolisetty Satyanarayana)కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. బొలిశెట్టికి, జ‌న‌సేన‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరిస్తూ బొలిశెట్టి సత్యనారాయణ పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, ఆయ‌న నిర్ణ‌యాన్ని పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) గౌర‌వించార‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయన చేపట్టే కార్యక్రమాలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది.

కొద్ది రోజుల క్రితం బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. అయితే పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. విశాఖలో పావురాల కొండ పర్యావరణ విధ్వంసంపై బొలిశెట్టి సత్యనారాయణ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. కొల్లేరులో కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు గత పదేళ్లుగా సముద్రం కాలుష్యం జరుగుతోంద‌ని, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు సరిగా పని చేయడం లేద‌ని బొలిశెట్టి ఆరోపిస్తున్నారు. కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త వ‌హిస్తుండ‌టంతో పార్టీ ప‌ద‌విలో ఉండి ప్ర‌శ్నించ‌డం భావ్యం కాద‌ని బొలిశెట్టి భావించారు. బొలిశెట్టి పార్టీ ప‌ద‌వుల‌కు మాత్ర‌మే రాజీనామా చేయ‌గా.. పార్టీ అధిష్టానం మాత్రం ఆయ‌న‌తో ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై బొలిశెట్టి ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ​పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల కోసం రాష్ట్ర, దేశ స్థాయిలో మరింత చురుగ్గా పని చేయాలనే త‌న‌ అభ్యర్థనను మన్నించి, పార్టీ బాధ్యతల నుండి విముక్తి క‌ల్పించారంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పార్టీ పరంగా దూరమైనా, సిద్ధాంతాల పరంగా ఇద్ద‌రి అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ప‌వ‌న్‌తో త‌న‌ను క‌లిపిన‌, ప‌వ‌న్‌తో కలిసి పని చేద్దామ‌నుకున్న పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కోసం తాను కోరగానే పదవి బాధ్యతల నుంచి విముక్తి క‌ల్పించేందుకు చొర‌వ చూప‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కొల్లేరు సరస్సు రక్షణ, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, భూ నిర్వాసితుల సమస్యల విషయంలో మరింత చొరవ చూపి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఆశించారు. పర్యావరణ ప్రభావ అంచనాలు లేకుండా చిత్తడి నేలలను ఆక్రమించడం, వ్యవసాయ భూముల భూ వినియోగ మార్పిడి వంటి వాటిని నిరోధించి, ప్రకృతిని కాపాడే విషయంలో చిత్తశుద్ధితో బాధ్య‌త నిర్వ‌ర్తించాల‌ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>