ముంబైలోనే ఆపరేషన్ ఎందుకు?​.. జనసేన క్లారిటీ

కలం, వెబ్ డెస్క్: ఏపీ, తెలంగాణలో అత్యాధునిక వైద్య సదుపాయాలున్నా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ (Pawan Kalyan) మాత్రం ఆపరేషన్ కోసం ముంబైకి ఎందుకు వెళ్లారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వర రావు చేసిన విమర్శలకు జనసేన క్లారిటీ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు లేవనే కారణంగా పవన్ కళ్యాణ్​ అక్కడకు వెళ్లలేదని.. విమర్శలు చేసే ముందు ఆలోచించాలని, వాస్తవాలు అర్థం చేసుకోవాలని సూచించింది.

ఆసుపత్రిలో ఇబ్బంది కలగొద్దనే..

పవన్ కళ్యాణ్ స్థాయికి ఏ​ ప్రముఖ ఆసుపత్రిలోనైనా చేరే అవకాశం ఉందని జనసేన పేర్కొంది. ‘ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేరాలని నిర్ణయించుకోవడానికి బలమైన కారణం ఉంది. పవన్ కళ్యాణ్​ ప్రజా నాయకుడు మాత్రమే కాదు, దేశంలోనే ప్రముఖ సెలెబ్రిటీ కూడా. ఆయన​ ఆసుపత్రిలో ఉన్నారంటే చూసేందుకు అభిమానులు, మద్దతు దారులు, రాజకీయ నాయకులు, అధికారులు వస్తుంటారు. దాని వలన అక్కడ ఉండే రోగులు, వైద్యులకు ఇబ్బంది కలుగుతుంది. అందుకోసమే పవన్ ముంబైలో ట్రీట్మెంట్ తీసుకోవాలని భావించారు’ అని తెలిపింది.

గతంలో కూడా చాలాసార్లు..

పవన్ కళ్యాణ్​ ఇలా చేయడం ఇదే మొదటిసారని జనసేన గుర్తు చేసింది. ‌’చాలాసార్లు తక్కువ వైద్య సదుపాయాలతో ఆయన నివాసం, ఆఫీసులోనే చికిత్స తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొవిడ్ సమయంలో కూడా ఆసుపత్రిలో కాకుండా తన ఫాంహౌస్‌లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీటన్నింటికీ ఒకే కారణం.. తన వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఇలా చేశారు’ అని పేర్కొంది.

వీలైతే అభినందించండి..

పవన్ కళ్యాణ్​ ముంబైకే ఎందుకు వెళ్లారని విమర్శించడం మానేసి, ఆ నిర్ణయం వెనుక ఉన్న గొప్ప ఆలోచనను చూసి అభినందించాలని నాగేశ్వర రావుకు జనసేన సూచించింది. ‘పబ్లిసిటీ కంటే రోగుల సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నాయకుడికి కాస్త గౌరవం ఇవ్వండి తప్ప ఆరోపణలు చేయొద్దు. విమర్శలు చేసే ముందు, అసలు నిజమేంటో తెలుసుకోవాలని.. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు’ అని హితవు పలికింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>