మళ్లీ పాతరోజులు.. 12 ఏండ్ల నాటి పరిస్థితి రిపీట్: జగదీశ్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం మళ్లీ తీవ్ర ఇబ్బందుల పాలవుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy)   మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు మహాధర్నా’లో పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధర్నాలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాకముందు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయని రోజంటూ లేదని గుర్తు చేశారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మార్క్ పాలన వల్ల రైతులు అదే దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి ప్రాధాన్యం

కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఊరూరు తిరిగి ఇక్కడి కష్టాలను స్వయంగా చూశారని, అందుకే ఒక ప్రత్యేక ప్రణాళికతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు. బిఆర్ఎస్ హయాంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల 2013లో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న జిల్లా ధాన్యం ఉత్పత్తి, 2023 నాటికి ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని జగదీశ్‌రెడ్డి వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వరి కొనుగోలు చేయనని మొండికేసినప్పుడు, ఢిల్లీ వేదికగా రైతుల కోసం కేసీఆర్ ధర్నా చేశారన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుల కల్లాల వద్దకే వెళ్లి, తడిసిన ధాన్యాన్ని సైతం భేషరతుగా కొనుగోలు చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

రేవంత్‌ను నమ్మి జనం మోసపోయారు

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లేసినందుకు రైతులు ఇప్పుడు నష్టపోతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రికి కనీసం సమీక్ష నిర్వహించే తీరిక కూడా లేదని, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో క్వింటాల్‌కు 10 కిలోల వరకు కటింగ్ పెడుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు.

మంత్రుల దృష్టి దోచుకోవడం మీదే..

జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కేవలం ఎలా దోచుకోవాలి, దాచుకోవాలి అనే ధ్యాసలోనే ఉన్నారని, మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకోవడానికే మంత్రులు ఈ దోపిడీపై మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. హెలికాప్టర్ లేనిదే.. మంత్రులు కాలు బయటపెట్టడం లేదని, అందుకే 3 నెలల నుంచి జిల్లా పర్యటనకు ఇద్దరు మంత్రులు రాలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ, చంద్రబాబు కలయికతో పుట్టిన ఒక ‘హైబ్రిడ్ కాంగ్రెస్’ అని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు కాంగ్రెస్ నాయకులే ప్రస్తుత పాలన నచ్చక తమతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కల్లాల వద్ద ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తరుగు పేరుతో సాగుతున్న దోపిడీని తక్షణమే అరికట్టాలని  డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>