కలం, సూర్యాపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విఫల పాలన వల్లే పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. నీళ్లు, కరెంట్ లేక ఎండిపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, దెబ్బతిన్న పంటల వివరాలను స్థానిక రైతులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చీదెళ్ల సబ్ స్టేషన్‌కు వెళ్లిన జగదీష్ రెడ్డి, అక్కడ విద్యుత్ సరఫరా లాగ్ బుక్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయిన దీనస్థితి కనిపిస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు ముందుగానే సగం పొలాల్లోనే నాట్లు వేశారని, కానీ ఆ ఉన్న సగం పంటను కూడా కాపాడలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. “అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుంది” ఈ ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, నిర్వహణ లోపం వల్ల పంటలను ఎండబెడుతున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. అరకొరగా ఇచ్చే విద్యుత్ సరఫరాతో లో-వోల్టేజీ సమస్య ఏర్పడి గ్రామాల్లో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ రాష్ట్రానికి పట్టిన కాంగ్రెస్ దయ్యాన్ని, రేవంత్ భూతాన్ని ఎలా వదిలించాలో రైతాంగానికి బాగా తెలుసని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తనపై భౌతిక దాడులు చేయించినంత మాత్రాన ఎండిపోయిన పొలాలు, రైతుల ఇబ్బందులు మరుగునపడవని, డైవర్షన్ రాజకీయాలు ఇక చెల్లవని ఆయన (Jagadish Reddy) స్పష్టం చేశారు.
కన్నేపల్లి పంప్ హౌస్‌లో స్విచ్ ఆన్ చేస్తే పంటలకు సరిపడా నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం కావాలనే ఉపేక్షిస్తోందన్నారు. మీడియా సంస్థలు తమ విలేకరులను గ్రామాల్లో తిప్పి క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజలకు చూపాలని కోరారు. రైతాంగం విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, రైతులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడలేదని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు సమృద్ధిగా పంటలు పండించుకున్నామని, ఇప్పుడు మళ్లీ మన పంటలను కాపాడుకునేందుకు రైతులంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంటలకు నీరు, విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించకపోతే బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

