కలం, వెబ్ డెస్క్: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ దొంగ (Thief) చేసిన సాహసం చూసి అందరూ షాకవుతున్నారు. చివరికి పోలీసులు సైతం వామ్మో.. వీడు మామూలోడు కాదు అనుకున్నారు…! ఎందుకంటే ఆ దొంగ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా 5 గంటలు నీటిలో దాక్కున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ (Jabalpur)లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హర్వీందర్ సింగ్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో రైళ్లలో చోరీలు చేస్తూ ఉంటాడు. తాజాగా రేవ నుంచి ఇట్వారీ వెళ్తున్న ఓ రైతులో ఏసీ కోచ్‌లో ఓ మహిళ పర్స్ కొట్టేశాడు. ఆ తర్వాత చైన్ లాగి రైలు దిగి పారిపోయాడు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని వెంబడించారు.
పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు హర్వీందర్ దారిలో నాచుతో నిండి, బురదగా ఉన్న ఒక చిన్న చెరువులోకి దూకాడు. పోలీసులు తనను గుర్తించకుండా ఉండేందుకు ఏకంగా ఐదు గంటల పాటు నీటి అడుగునే ఉండిపోయాడు. నీటి లోపల ఊపిరి తీసుకోవడం కోసం హర్వీందర్ ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. అక్కడ ఉన్న ఒక తామర కాండం ద్వారా గాలి పీల్చుకుంటూ గంటల తరబడి నీటిలోనే దాక్కున్నాడు. పోలీసులు ఎంత వెతికినా నాచు, బురద వల్ల అతను కనిపించలేదు. చివరకు గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా నాచు పొరల కింద దాక్కున్న హర్వీందర్‌ను గుర్తించి బయటకు లాగి అరెస్ట్ చేశారు.
హర్వీందర్ సింగ్ యూపీకి చెందిన అంతర్రాష్ట్ర దొంగ అని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు రైళ్లలో 400కు పైగా చోరీలు చేసిన ఇతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. గతంలో 2018లో ఏపీలోని విజయవాడ పోలీసులు హర్వీందర్‌ను అరెస్ట్ చేసి రూ.70 లక్షల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీణం చేసుకున్నారు. రైళ్లలో టికెట్ లేకుండా తిరుగుతూ, ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకోవడం హర్వీందర్ సింగ్ ప్రధాన వృత్తి అని పోలీసులు వెల్లడించారు.

