కలం, వెబ్ డెస్క్ : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రెచ్చిపోయారు. బంతి పడటం ఆలస్యం దానిని బౌండ్రీ దాటించడమే టార్గెట్‌గా పరుగుల వర్షం కురిపించారు. ట్రావిస్ హెడ్ మినహా మిగిలిన వారంతా ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ అంతా కూడా ఉప్పల్ స్టేడియంలో వీరవిహారం చేశారు. ఈ మ్యాచ్ (SRH vs RCB) లో ఇషాన్ కిషన్ తనను ముద్దుగా పిలుచుకునే పాకెట్ డైనమైట్ అన్న పేరును నిరూపించుకున్నాడు. ఇక బెంగళూరు బౌలర్లలో ప్రతి ఒక్కరూ పరుగులు భారీగా సమర్పించుకున్నారు. చెప్పుకోదగ్గ బౌలింగ్ కూడా వేయలేకపోయారు. గుడ్డికన్నా మెళ్ల నయం అన్న సామెతలో ఆర్‌సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ ఒక్కడు కాస్త మంచి బౌలింగ్ వేశాడని చెప్పుకోవాలి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ పవర్‌హౌస్‌లా మారి బెంగళూరు బౌలింగ్‌ను ముక్కలు ముక్కలు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసి రసిఖ్ సలామ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. మొదటి వికెట్‌కు 45 పరుగులు జోడించిన తర్వాత అసలు సిసలైన విధ్వంసం మొదలైంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి సుయాష్ శర్మ బౌలింగ్‌లో కాక్స్ చేతికి చిక్కారు. 97 పరుగుల వద్ద రెండో వికెట్ పడినా రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఆర్‌సీబీ బౌలర్లకు నరకం చూపించారు. ఇషాన్ కిషన్ లీడ్ రోల్ తీసుకుని 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు దంచికొట్టారు. క్లాసెన్ సైతం తన మార్క్ హిట్టింగ్‌తో 24 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 51 పరుగులు చేసి పాండ్య బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అత్యంత వేగంగా 113 పరుగులు జోడించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో నితీష్ కుమార్ రెడ్డి కేవలం 12 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఇషాన్ కిషన్ అవుటైనప్పటికీ హైదరాబాద్ 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బెంగళూరు బౌలర్లలో రసిఖ్ సలామ్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా, సుయాష్ శర్మ 3 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. కృనాల్ పాండ్యకు ఒక వికెట్ దక్కింది. అయితే భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 51 పరుగులు, జోష్ హేజిల్‌వుడ్ 4 ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి భారీగా లీకేజ్ చేశారు. రోమారియో షెపర్డ్ సైతం 3 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో బెంగళూరు ముందు 256 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.

