epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వాట్సాప్​ కనుమరుగు కానుందా?

కలం, వెబ్​ డెస్క్​: ఈ టెక్నాలజీ యుగంలో పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాట్సాప్ (​WhatsApp) మన దినచర్యలో భాగమైపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల నుంచి మెస్సేజ్​ లు, వీడియోలు, కాల్స్​ తోపాటు కంపెనీల ఇంటర్వ్యూలకూ వాట్సాప్​ వాడడం సర్వసాధారణం అయ్యింది. ఇటీవలే పేమెంట్లకూ వాట్సాప్​ వినియోగిస్తున్నారు. ఇన్ని రకాల ఉపయోగాలున్న వాట్సాప్​ త్వరలో కనుమరుగు కానుందా? ఈ మెసేజింగ్​ యాప్​ కు ప్రత్యామ్నాయం రానుందా? అంటే అవుననే అంటున్నాయి వ్యాపార వర్గాలు. కారణం..వాట్సాప్​ కంటే మెరుగైన, ఆధునికమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి రానుండడమే. ఈ దిశగా గూగుల్​ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం దీనికి బలం చేకూరుస్తోంది.

ఎయిర్​టెల్​ అంగీకరించడంతో..:

WhatsApp కి ​ పోటీగా ప్రత్యామ్నాయ మెసేజింగ్​ వేదికను తీసుకురావాలని కొన్నేళ్లుగా గూగుల్​ ప్రయత్నిస్తోంది. తద్వారా ఈ విభాగంలో మెటా ఆధిపత్యానికి, మార్కెట్​ కు చెక్​ పెట్టడమే గూగుల్ ఉద్దేశం. వాస్తవానికి వాట్సాప్​ కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వినియోగదారులు ఉన్నారు. చైనా, ఉత్తర కొరియా, సిరియా మినహా దాదాపు 180 దేశాల్లో వాట్సాప్​ సేవలు అందుబాటులో ఉన్నాయి. రష్యా, యూఏఈ, ఖతార్​, ఈజిప్ట్​, ఒమన్​ దేశాల్లో వాయిస్​/వీడియో కాల్స్​ మీద ఆంక్షలతో వాట్సాప్​ పనిచేస్తోంది. ఆయా దేశాలు సెక్యూరిటీని, స్థానిక టెలికాం సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ పరిమితులు విధించినట్లు చెబుతున్నాయి. ఇక మన దేశంలో అయితే దాదాపు 85 కోట్ల మంది వాట్సాప్(WhatsApp)​​ వాడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందువల్లే వాట్సాప్​ కు భారత్​ అతి పెద్ద మార్కెట్​ గా ఉంది. దీనిపై గూగుల్​ కన్నుపడింది.

ఎలాగైనా సరే WhatsApp ​కు తద్వారా మెటా ఆధిపత్యానికి చెక్​ పెట్టాలని గూగుల్​ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఆర్​సీఎస్​ మెసేజ్​ ప్లాట్ఫామ్​ ను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా మన దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీలయిన ఎయిర్​టెల్​, రిలయన్స్​ జియో, వొడాఫోన్​ ఐడియాలను సంప్రదించింది. కొత్త మెసేజింగ్​ ప్లాట్​ ఫామ్​ తయారీలో ఈ మూడింటినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించి, ప్రయత్నాలు ప్రారంభించింది. గూగుల్​ ప్రతిపాదనకు జియో, వొడాఫోన్​ ఐడియా ఒప్పుకున్నాయి. కానీ, ఎయిర్​టెల్​ మాత్రం అంగీకరించలేదు. కారణం.. ఆర్​సీఎస్​లో స్పామ్​ నియంత్రణకు సరైన వ్యవస్థ లేకపోవడమే. అందువల్ల గూగుల్​ ప్రతిపాదనను ఏడాదికి పైగా పెండింగ్​ లో పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల భారత టెలికాం మంత్రిత్వ శాఖ.. టెలికాం కంపెనీలన్నీ స్పామ్​కాల్స్​, మెసేజ్​లపై విధిగా తమ వినియోగదారులను హెచ్చరించాలనే నిబంధన పెట్టింది. మరోవైపు స్పామ్​ నియంత్రణకు ఏఐతో ఆధునిక వ్యవస్థను గూగుల్​ సిద్ధంచేసింది. ఈ పరిణామాల వల్ల గూగుల్​ ప్రతిపాదనకు ఎయిర్​టెల్​ పచ్చజెండా ఊపింది. ఫలితంగా త్వరలోనే ఆర్​సీఎస్​ మెసేజింగ్​ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

ఆర్​సీఎస్​ ఫీచర్లు, ప్రయోజనాలు..:

రిచ్​ కమ్యూనికేషన్​ సర్వీస్​కు సంక్షిప్త రూపమే ఆర్​సీఎస్​. ప్రస్తుతం మనకు తెలిసిన ఎస్​ఎంఎస్, ఎంఎంఎస్​లకు ఆధునిక వెర్షన్​ ఇది. మొబైల్​ డేటా, వైఫై ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో రిచ్​ ఫీచర్లు ఉంటాయి. హై రెజల్యూషన్​ (అధిక నాణ్యత) కలిగిన ఫొటోలు, వీడియోలు, జిఫ్​లు పంపొచ్చు. మన మెసేజ్​కు ఎవరైనా రిప్లయ్​ ఇచ్చేటప్పుడు టైప్​ చేయడం చూపిస్తుంది. అలాగే రీడ్​ రిసీప్ట్​లు చూడొచ్చు. గ్రూప్​ చాట్​ లు చేయొచ్చు. మెసేజ్​లో అక్షరాల పరిమితి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ మెసేజ్​లకు భిన్నంగా, వాట్సాప్​ ఫీచర్ల తో పాటు మరికొన్ని అదనంగా ఆర్​సీఎస్​ లో ఉంటాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన ఫీచర్​.. సాధారణ ఎస్​ఎంఎస్​ / ఎంఎంఎస్​ మాదిరి సెల్యులార్​ నెట్వర్క్​ పై కాకుండా, డేటా కనెక్షన్​పై పనిచేయడం. మన ఫోన్​ లోని సాధారణ మెసేజింగ్ యాప్​కు మరింత ఆధునికంగా, రిచ్​ ఫీచర్లతో ఆర్​సీఎస్​ ఉంటుంది. ఎస్​ఎంఎస్​ కు తర్వాతి తరమే ఈ ఆర్​సీఎస్​.

గూగుల్​కే అధిక వాటా:

ఆర్​సీఎస్​ ప్లాట్​ ఫామ్​లో ఒక్కో మెసేజ్​ కు 0.11 పైసల చొప్పున వసూలు చేస్తారు. ఆదాయం 80:20 నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే గూగుల్​కు 80శాతం వాటా అందుతుంది. ఆర్​సీఎస్​కు దేశంలోని మూడు ప్రధాన టెలికం సర్వీసులు అంగీకరించడంతో ఇక త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రావడమే మిగిలుంది.

Read Also: ‘వందేమాతరం’ ను కాంగ్రెస్ ముక్కలు చేసింది : మోడీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>