కలం, వెబ్ డెస్క్: భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలక్టర్ల తీరును తప్పుపట్టారు. టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ షమికి మరోసారి నిరాశ ఎదురైంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమికి ఏ ఫార్మాట్‌లోనూ భారత జట్టులో అవకాశం లభించకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన చూపుతున్నప్పటికీ షమికి టీమిండియాలో ఛాన్స్ దొరకడం లేదు.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) సెలక్టర్ల తీరుపై ఘాటుగా స్పందించాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమి దేశవాళీ క్రికెట్‌లో 200 ఓవర్లు బౌలింగ్ చేసి ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడని స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 450కు పైగా వికెట్లు తీసిన బౌలర్ విషయంలో ఇంకా సందేహాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించాడు. ఇన్ని ఓవర్లు వేసిన తర్వాత కూడా ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు వస్తే అతను ఇంకా ఏం చేయాలో సెలక్షన్ కమిటీకి మాత్రమే తెలుసని అన్నాడు.
అయితే షమి రీఎంట్రీకి అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో కొత్త బంతితో ప్రభావవంతంగా రాణిస్తే అతడిని విస్మరించడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అక్కడ సత్తా చాటితే జాతీయ జట్టులోకి తిరిగి రావడం ఖాయమని తెలిపాడు. షమి రీఎంట్రీకి తలుపులు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని ఇర్ఫాన్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు.


