కలం, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) వరుస వైఫల్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన అభిషేక్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలక సూపర్-8 పోరుకు ముందు పఠాన్ కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఆఫ్‌స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అభిషేక్ టెక్నిక్, షాట్ ఎంపికలో పొరపాట్లు చేస్తున్నారని ఆయన విశ్లేషించారు. బంతిని నేరుగా ఆడకుండా అడ్డంగా ఆడేందుకు ప్రయత్నించడం వల్లే పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల్లో అవుట్ అయ్యారని గుర్తు చేశారు.
బౌలర్లు చోటు ఇవ్వకపోయినా రూమ్ కోసం ప్రయత్నించడం అభిషేక్‌కు (Abhishek Sharma) ఇబ్బందిగా మారుతోందని పఠాన్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నిక్‌ను మార్చుకోకుండా, కేవలం సింగిల్స్ తీసి ఖాతా తెరవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు ఆచితూచి ఆడి, ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ కీలక మ్యాచ్‌లోనైనా అభిషేక్ శర్మ తన ఫామ్‌ను అందుకుంటారో లేదో చూడాలి.
Read Also: నేటి మ్యాచ్ అభిషేక్ శర్మకు అగ్నిపరీక్ష
Follow Us On : WhatsApp


