కలం, స్పోర్ట్స్: ఫిఫా 2026 ప్రపంచకప్ అన్ని జట్లకు ఒక ఛాంపియన్షిప్ మాత్రమే. కానీ ఇరాన్ (Iran) మాత్రం ఒక యుద్ధమే చేసింది. ఛాంపియన్‌షిప్‌లోకి రావడానికి సిద్ధమైన క్షణం నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు ప్రతి క్షణం ఒక మహాసంగ్రామంలానే సాగింది. అవమానాలు, అవరోధాలు ఇలా ఒకటా రెండా అడుగడుగా కష్టాలే. అయినా కన్నీరు కార్చలేదు ఇరాన్.. పట్టుదలతో పోరాడింది. ట్రోఫీ గెలవలేకపోయినా అభిమానుల అభిమానాన్ని, ఎనలేని గౌరవాన్ని అందుకుంది.
ప్రపంచకప్‌లో ప్రతి జట్టూ గెలుపు కోసం పోరాడుతుంది. కానీ ఇరాన్ (Iran) మాత్రం మైదానంలో ప్రత్యర్థులతోనే కాదు.. మైదానం బయట పరిస్థితులతో కూడా యుద్ధం చేసింది. నాకౌట్‌కు చేరకపోయినా, ఈ ప్రపంచకప్‌లో ఇరాన్ ప్రయాణం మాత్రం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేనిదిగా నిలిచింది. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసిన వెంటనే ఇరాన్ జట్టుకు మరో దెబ్బ తగిలింది. అమెరికాలో రాత్రి బసకు అనుమతి లేకపోవడంతో వెంటనే మెక్సికోలోని టిజువానాకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్ల రికవరీ దెబ్బతిందని జట్టు యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వీసా సమస్యలు వెంటాడాయి
వీసా ఇబ్బందుల కారణంగా కీలక అధికారులు, మీడియా ప్రతినిధులు, సపోర్ట్ స్టాఫ్‌లో చాలామంది జట్టుతో ఉండలేకపోయారు. మొదట ఏర్పాటు చేసిన అరిజోనా బేస్ క్యాంప్‌ను కూడా వదిలేయాల్సి వచ్చింది. టిజువానా నుంచి అమెరికాకు సరిహద్దు దాటి ప్రతి మ్యాచ్‌కు వెళ్లడం జట్టుపై అదనపు భారం వేసింది. మ్యాచ్‌ల తర్వాత మీడియా సమావేశాల్లో ఇరాన్ జట్టు ఎదుర్కొన్న ఇబ్బందులపై కెప్టెన్ మెహ్దీ తరేమీ, మిడ్‌ఫీల్డర్ మహ్మద్ మొహెబీ మాట్లాడకుండా ఫిఫా అధికారులు అడ్డుకున్నట్లు సమాచారం.
వార్తో చెదిరిన కల
ఈజిప్ట్‌తో చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఇరాన్ మొదట వెనుకబడింది. తర్వాత రమిన్ రెజాయియన్ అద్భుత గోల్‌తో సమం చేశాడు. నాకౌట్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. అదనపు సమయంలో షోజాయే ఖలీల్జాదె గోల్ కొట్టడంతో ఇరాన్ శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. కానీ VAR ఆ గోల్‌ను ఆఫ్‌సైడ్‌గా తేల్చింది. క్షణాల్లోనే ఆనందం కన్నీళ్లుగా మారింది. తమ మ్యాచ్ డ్రాగా ముగిసినా ఇరాన్ ఆశలు పూర్తిగా చావలేదు. అల్జీరియా-ఆస్ట్రియా మ్యాచ్ ఫలితంపై ఎదురుచూసింది. స్టాపేజ్ టైమ్‌లో అల్జీరియా 3-2తో ఆధిక్యంలోకి వెళ్లడంతో ఇరాన్ నాకౌట్ చేరినట్టే కనిపించింది. కానీ చివరి కిక్‌తోనే ఆస్ట్రియా గోల్ చేసి 3-3తో మ్యాచ్‌ను డ్రా చేసింది. అదే గోల్ ఇరాన్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలికింది.
గెలవలేదు… కానీ గౌరవం గెలుచుకుంది
ఒక్క గ్రూప్ మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. చివరి వరకు పోరాడింది. అయినా నాకౌట్ టికెట్ దక్కలేదు. రాజకీయ ఉద్రిక్తతలు, ప్రయాణ కష్టాలు, వీసా సమస్యలు, చివర్లో వార్ నిరాశ… ఇలా ఎన్నో అడ్డంకుల మధ్య ఇరాన్ పోరాటం ఈ ప్రపంచకప్‌లో ప్రత్యేక కథగా మిగిలిపోయింది.

