కలం, ఖమ్మం బ్యూరో : వృద్ధ తల్లిదండ్రులను గౌరవించడం ప్రతిఒక్కరి బాధ్యత అని, వారిని అనాథలుగా వదిలేసి ఆస్తులు లాక్కుంటే.. ఆ ఆస్తులు దక్కకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా పర్యవేక్షణలో గురువారం కొత్తగూడెం క్లబ్ (Kothagudem Club) నందు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం (International Day of Older Persons) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, డిఆర్ఓ పద్మావతి, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిపిఓ అనూషలు జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కట్ చేసి, ‘తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం (MWPSC 2007)’ పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ.. వయోవృద్ధుల త్యాగాలను గుర్తించి వారిని గౌరవించాలని, అర్హులందరికీ చేయూత పెన్షన్లు అందించడంతో పాటు బ్యాంకులు, ఆసుపత్రులలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. డిఆర్ఓ పద్మావతి మాట్లాడుతూ.. వృద్ధులను నిరాదరణకు గురిచేస్తే ఆర్డీవో ఆఫీస్‌లోని ట్రిబ్యునల్ ద్వారా విచారణ జరిపి 2007 చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో వయోవృద్ధుల విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జడ్పీ సీఈఓ నాగలక్ష్మి తెలపగా, బాధితులు ఆన్లైన్లో లేదా 14567 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. అనంతరం స్వచ్ఛంద సేవా నిర్వాహకులను సన్మానించి, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

