కలం, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అన్ని ఫార్మాట్లలో కొత్త ప్లేయింగ్ కండిషన్లను అమలులోకి తెచ్చింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే అన్ని అంతర్జాతీయ సిరీస్‌లకు ఈ నియమాలు వర్తిస్తాయి. ఇప్పటికే ప్రారంభమైన మ్యాచ్‌లకు పాత నిబంధనలే కొనసాగుతాయి. ఎంసీసీ క్రికెట్ నియమాల్లో చేసిన మార్పులకు అనుగుణంగా పురుషుల, మహిళల, జూనియర్ క్రికెట్‌లో ఈ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
పురుషుల క్రికెట్‌లో బ్యాటర్లు సమయం వృథా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. నిర్దేశిత సమయంలో సిద్ధంగా లేని బ్యాటర్‌కు మొదటిసారి హెచ్చరిక ఇస్తారు. రెండోసారి తుది హెచ్చరిక ఉంటుంది. మూడోసారి నుంచి ఫీల్డింగ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు కేటాయిస్తారు. ప్రవర్తనా నియమావళి కింద కూడా చర్యలు ఉంటాయి. మహిళల క్రికెట్‌లో వాడే బంతుల పరిమాణం, బరువులో కీలక మార్పులు చేశారు.
పురుషులు, మహిళలు, జూనియర్ క్రికెట్‌కు వేర్వేరు బంతుల నిబంధనలను నిర్దేశించారు. ఆటలో సమానత్వం, నిలకడ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫీల్డింగ్ అంశాల్లో ఉన్న గందరగోళానికి ఐసీసీ తెరదించింది. బంతిని ఆపే క్రమంలో జరిగే మిస్‌ఫీల్డ్ లేదా తోటి ఫీల్డర్‌కు ఇచ్చే పాస్‌లను ఇకపై ఓవర్‌త్రోగా పరిగణించరు. బంతి ఆగిందో లేదో నిర్ణయించే పూర్తి అధికారం అంపైర్లకే ఉంటుంది.
రనౌట్, స్టంపింగ్ నిబంధనల్లో స్పష్టత తీసుకొచ్చారు. వికెట్లను పడగొట్టే సమయంలో ఫీల్డర్ చేతిలో బంతిపై పూర్తి నియంత్రణ ఉండాలి. కేవలం బంతిని తాకుతూ వికెట్లను పడేస్తే అది అవుట్ కానేకాదు. టెస్టు క్రికెట్‌లో వెలుతురు లేమి సమస్యను నివారించేందుకు ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. డే టెస్టుల్లో పరస్పర అంగీకారంతో పింక్ బాల్‌ను ఉపయోగించవచ్చు. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవాలి.
ఒకసారి ప్రారంభమయ్యాక బంతిని మార్చేందుకు వీలుండదు. టెస్టుల్లో రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడినా ఆట ముగియదు. వాతావరణం అనుకూలిస్తే ఓవర్ పూర్తి చేసేవరకు ఆట కొనసాగుతుంది. ఇరు జట్ల అంగీకారంతోనే ఈ నిర్ణయం అమలవుతుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ మార్పులు చేశారు. టి20 మ్యాచ్‌లలో ఇన్నింగ్స్ విరామం 15 నిమిషాలు ఉంటుంది. సమయం వృథా అయితే దీనిని 10 నిమిషాలకు తగ్గిస్తారు.
డ్రింక్స్ సమయాల్లో హెడ్ కోచ్ లేదా ప్రతినిధి మైదానంలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. లెగ్ సైడ్ వైడ్ నిబంధనను వన్డే, టి20ల్లో శాశ్వతం చేశారు. ఆట సమగ్రతను దెబ్బతీయకుండా, ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఐసీసీ (ICC) వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ చర్చల తర్వాతే ఈ మార్పులకు తుది రూపునిచ్చినట్లు స్పష్టం చేశాయి.

