కలం, ఖమ్మం బ్యూరో: రేపట్నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం (Khammam)లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద అన్నిరకాల వసతులు కల్పించారు. విద్యుత్, తాగునీరు లాంటివి ఏర్పాటు చేశారు. అలాగే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులు, పారామెడికల్ సిబ్బంది అదుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. చీఫ్ సూపరిండెంట్ మినహాయించి ఎవ్వరికీ ఎగ్జామ్ హాల్లో ఫోన్ అనుమతించరు. పరీక్ష కేంద్రంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్‌లకు అనుమతి లేకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల రూట్లలో బస్సులు ప్రత్యేకంగా నడపాలని ఇప్పటికే ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేశారు.
పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాల తలింపులో పోస్టల్ శాఖ, ఆర్టీసీ (RTC) సమన్వయం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ప్రశ్న పత్రాల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా గట్టి బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది.

