భూభారతి పోర్టల్ పరిశీలన కోసం.. పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన కూసుమంచి

కలం, ఖమ్మం బ్యూరో : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భూమి సంబంధిత సేవలను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకి తీసుకువస్తూ ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్’ (Integrated Bhu Bharati) ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం (Khammam) జిల్లాలోని కూసుమంచి (Kusumanchi)మండలంలో ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు.

ఈ పోర్టల్ ద్వారా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్‌లు కూడా అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి రైతులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేస్తే, ఆ సమాచారం నేరుగా సర్వేయర్‌కు చేరుతుంది. రైతులు ఇంటి నుంచే సులభంగా స్లాట్ బుకింగ్ చేసుకునేలా ఈ వ్యవస్థ రూపొందించారు. పోర్టల్‌లో లాగిన్ అయిన వెంటనే రైతులకు తమ భూమి వివరాలు కనిపిస్తాయి. అవసరమైన ఎకరాలకు అనుగుణంగా ఫీజు చెల్లించిన తర్వాత, సంబంధిత గ్రామంలోని లైసెన్స్ సర్వేయర్‌కు సమాచారం చేరుతుంది. రెండు రోజుల్లో పక్క భూమి యజమానులకు నోటీసులు జారీ చేసి, ఏడు రోజుల్లో సర్వే పూర్తి చేస్తారు.

సర్వే పూర్తైన తర్వాత మ్యాప్‌ను సిస్టంలో నమోదు చేసి, దరఖాస్తుదారుడికి యూనిక్ ‘భూధార్’ నంబర్ కేటాయిస్తారు. ఈ వివరాలు భూ భారతి (Bhu Bharati) పోర్టల్‌లో నమోదు అవుతాయి. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ నుంచి సర్వే పూర్తి అయ్యే వరకు ప్రతి దశలో రైతుల మొబైల్‌కు మెసేజ్‌లు వస్తాయి. ప్రస్తుతం కూసుమంచి మండలంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న ఈ పోర్టల్ విజయవంతమైతే, త్వరలోనే ఇతర మండలాలకు కూడా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>