కలం, ఖమ్మం బ్యూరో: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం జనాలు ఎంతటి సాహసానికైనా ఒడిగడుతున్నారు. చివరికి అది చట్ట ప్రకారం నేరమని తెలిసినా రీల్స్ పిచ్చిలో కటకటాల పాలవుతున్నారు. ఉడుములను వేటాడి హింసిస్తూ వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన ఓ నెటిజన్ను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో వెలుగుచూసింది.
ఉలవనూరు ప్రాంతానికి చెందిన యాసా చంటి అనే వ్యక్తి కుక్కల సహాయంతో ఉడుములను దారుణంగా వేటాడుతూ, వాటిని హింసిస్తున్న దృశ్యాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వ్యూస్ కోసం పోస్ట్ చేసిన ఈ వీడియోలు కాస్త వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారుల కంటపడ్డాయి.ఉడుములను వేటాడుతున్న దృశ్యాలను తీవ్రంగా పరిగణించిన బ్యూరో అధికారులు వెంటనే స్థానిక అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు ఉలవనూరులో వేగంగా విచారణ చేపట్టి, వీడియోల ఆధారంగా నిందితుడు యాసా చంటి అని నిర్ధారించుకున్నారు.
దీంతో అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972 ప్రకారం కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ విచారణ దర్యాప్తులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కవితా మాధురి, ఎఫ్ఎస్ఓ లు కృష్ణయ్య, సునీత, ఎఫ్బీఓ లు ఇరులాల్, వెంకట్రామ్లు పాల్గొన్నారు. మూగజీవాలను వేటాడినా లేదా వాటిని హింసించే దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేసినా చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.

