కలం, వనపర్తి: జర్నలిస్టుల హక్కులు, సామాజిక, ఆర్థిక భద్రత కోసం అక్టోబర్ 2న ‘డిమాండ్ల దినోత్సవం’ నిర్వహించనున్నట్లు తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ – ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ IJU) వనపర్తి జిల్లా అధ్యక్షుడు డి.మాధవరావు తెలిపారు. మంగళవారం జిల్లా కార్యదర్శి బి.రాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తేదీన తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద జర్నలిస్టులు నిరసనలు చేపట్టి.. కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాధవరావు పిలుపునిచ్చారు. మీడియా రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక జాతీయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు గతంలో కల్పించిన ఉద్యోగ భద్రత, సేవా నిబంధనలు, వేతనాలు పునరుద్ధరించాలని కోరారు.
కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి..
జర్నలిస్టులు, ఇతర మీడియాల్లోని సిబ్బందికి జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు కల్పించేందుకు కొత్త వేజ్‌బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాధవ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు అందించి నగదు రహిత వైద్యసేవలు కల్పించాలని కోరారు.
వనపర్తి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సదుపాయాలు కల్పించడంతో పాటు అక్రిడిటేషన్, గుర్తింపు కార్డులు, విధి నిర్వహణకు అవసరమైన సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాధవరావు కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బి.రాజు, ఉపాధ్యక్షుడు కమల్ రెహమాన్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నరసింహరాజు, పట్టణ అధ్యక్షుడు తైలం అరుణ్‌రాజ్, యూనియన్ సభ్యులు ముంత రవి, జియా, ముక్తార్, పీఆర్‌టీవీ చంద్రమౌళి, నరేష్, నజీర్, చాంద్‌పాషా, బాలరాజు పాల్గొన్నారు.

