గుట్రాజ్‌ప‌ల్లె ప్రభుత్వ భూములు స్వాహా..!

కలం, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్‌ప‌ల్లె (Gutrajpally) గ్రామంలో ప్రభుత్వ భూముల (Government Lands) పై కన్నేసిన కొందరు భూసాములు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి. గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ రెవెన్యూ భూములు, గుట్టలు, బోర్లు, చెరువు పరివాహక ప్రాంతాలకు చెందిన భూములను జేసీబీల సహాయంతో మట్టి చదును చేసి తమ సొంత వ్యవసాయ భూముల్లో కలుపుకుంటున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం గత కొంతకాలంగా గ్రామంలోని కొందరు ప్రభావశీల వ్యక్తులు ( తాజా మాజీ ప్రజాప్రతినిధులు) ప్రభుత్వ భూముల సరిహద్దులను చెరిపివేసి, గుట్టలను తొలగించి ప్రభుత్వ భూమిని తమ భూముల్లో కలుపుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ప్రభుత్వానికి చెందిన భూమి విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండగా, భవిష్యత్తులో ప్రజా అవసరాలకు ఉపయోగపడే భూములు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రత్యేకించి గుట్రాజ్ పల్లె గ్రామ శివారులో ఉన్న మట్టి గుట్టలను జేసీబీ, ట్రాక్టర్ లతో తవ్వి చదును చేసి మట్టిని సమీప పొలాలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సహజ భౌగోళిక స్వరూపం దెబ్బతినడమే కాకుండా, వర్షాకాలంలో మట్టి కోత, నీటి ప్రవాహ మార్పులు వంటి పర్యావరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

అధికారుల తీరుపై విమర్శ‌లు

గుట్రాజ్ పల్లె గ్రామ ప్రజలు పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గ్రామంలోని కొందరు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు అధికారులను అదుపు చేస్తుండటంతో ఇప్పటి వరకు గ్రామంలో సమగ్ర సర్వే నిర్వహించి ఆక్రమణలను అడ్డుకునే చర్యలు చేపట్టలేదని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై గ్రామంలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ భూముల స్వాహా చేయడం ప్రజాస్వామ్యమేనా? అని గ్రామస్తులు అధికారుల‌ను ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్టు అంచనాలు ఉన్నాయని, గ్రామంలో సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించి, అక్రమంగా ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ను గుట్రాజ్ పల్లె గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భూముల‌ తక్షణ సర్వేకు డిమాండ్

ప్రభుత్వ రెవెన్యూ భూములపై తక్షణ సర్వే నిర్వహించాల‌ని గ్రామ ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. గుట్టలు, బోర్లు, ప్రజా భూములను చదును చేసిన వారిపై కేసులు నమోదు చేయాల‌ని కోరుతున్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాల‌ని పేర్కొంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల‌ని కోరుతున్నారు. గ్రామంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>