కలం, తెలంగాణ బ్యూరో : ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ ఫేజ్ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. మొత్తం 3 లక్షల ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని, అందులో 2.90 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు దశలవారీగా నిధులు రిలీజ్ అయినందున 50 ఇండ్ల గృహప్రవేశం ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందన్నారు.
రెండు మూడు నెలల్లో మిగిలిన ఇండ్ల నిర్మాణం కూడా పూర్తవుతుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో సెకండ్ ఫేజ్ ‘ఇందిరమ్మ ఇండ్లు’ (Indiramma Indlu) స్కీమ్ లాంఛ్ అవుతుందన్నారు. గూడు లేని ప్రతీ కుటుంబానిక సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ శాఖ అధికారులతో సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా పై వివరాలు వెల్లడించారు.
హౌసింగ్, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నిర్మాణ దశలో ఉన్న రెండు లక్షలకు పైగా ఇండ్లను సత్వరమే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం భావించిందని, బడ్జెట్‌లో కేటాయింపులు చేసిందని గుర్తుచేశారు.
ఆదివాసీలు నివాసముండే ఐటీడీఏ ప్రాంతాలకు అదనపు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇల్లు అందే వరకు మూడో, నాలుగో విడతలుగా కూడా పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాత ఇందిరమ్మ పథకం కింద సహాయం పొందిన లబ్ధిదారులకు కూడా మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల ప్రయోజనం కల్పిస్తామని తెలిపారు. పేదలు వారి సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునే విషయంలో ఫారెస్ట్ లేదా ఇతర శాఖల నుంచి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన భూముల మధ్య ఎక్కువగా సరిహద్దు వివాదాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆధునిక సర్వే పరికరాలతో భూ వివాదాలకు ముగింపు పలకాలన్నారు. ఈ నెలాఖరులోగా నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్‌రూం కాలనీల్లో విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

