కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని యాదగిరిపల్లి, సైదాపూర్ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(Beerla Ilaiah) పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, మరణించినా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు.
నవంబర్ 19 నుంచి ప్రారంభమైన ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తికి జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే (Beerla Ilaiah) వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారుడు మరణించిన సందర్భంలో నిబంధనల ప్రకారం వారి నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు బీమా సంస్థల ద్వారా ఈ బీమా సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
పథకానికి సంబంధించిన ప్రక్రియ సజావుగా సాగేందుకు అర్హులైన కుటుంబాలు ఆధార్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు, మొబైల్ నంబర్ తదితర అవసరమైన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వాణి భరత్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిల్లర్లు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : దమ్ముంటే నా మీద పోటీ చేయాలి.. సీఎంకు హరీశ్ రావు సవాల్
Follow Us On : WhatsApp

