కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌తో రాష్ట్ర భవిష్యత్తును నిర్వచించామని గుర్తుచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ (Future City) ని నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీకి, డెటా సెంటర్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. లాజిస్టిక్ హబ్‌లకు ప్రణాళికలు రచిస్తున్నామని, ఫోర్త్ సిటీ నుండి బందర్ పోర్టుకు 12 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని గుర్తుచేశారు. రీజినల్ రింగ్ రోడ్డు –గ్రీన్ ఫీల్డ్ హైవే కలిసే ప్రాంతంలో డ్రై పోర్టు ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యామన్నారు. ఫోర్త్ సిటీ నుండి శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాక దేశంలోని పలు రాష్ట్రాలకు ఇక్కడి ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు.
మెట్రో రైల్ విస్తరణతో మెరుగైన కనెక్టివిటీ :
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చొరవతోనే హైదరాబాద్ సిటీలో మెట్రో రైల్ (Metro Rail) వ్యవస్థ ఉనికిలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఫస్ట్ ఫేజ్ పూర్తిచేసిందీ.. ఇకపైన ఫేజ్‌లను పూర్తి చేయబోయేదీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని నొక్కిచెప్పారు. హైదరాబాద్ సిటీలో మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ 69 కి.మీ. పూర్తి కావడంతో రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని గుర్తుచేశారు. సెకండ్ ఫేజ్‌ను రూ. 24,269 కోట్లతో విస్తరించబోతున్నామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరామాద్ మెట్రో దేశంలో 2వ స్థానం నుండి 9వ స్థానానికి దిగజారిందన్నారు. సెకండ్ ఫేజ్‌లో దశలో 76.4 కి.మీ. మేర విస్తరించబోతున్నామన్నారు. మెట్రోను ప్రభుత్వమే కొనుగోలు చేసి తెలంగాణ ప్రజల ఆస్తిగా మార్చామన్నారు.
ఎయిర్‌పోర్టులతో పట్టణాల అభివృద్ధి :
మన పొరుగు రాష్ట్రాల్లో పది నుండి పదిహేను ఏయిర్ పోర్టులు ఉన్నాయని, కానీ హైదరాబాద్‌కు మాత్రం కేవలం రెండే ఏయిర్ పోర్టులు ఉన్నాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు పవర్‌లోకి రాగానే ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలనే దృష్టి పెట్టామన్నారు. వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం కోసం 235 ఎకరాలను సేకరించి ఈ ఏడాది జనవరి 29న ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు సీఎం గుర్తుచేశారు. భూ సేకరణ, పునరావాసం కోసం సుమారు రూ. 295 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రాబోయే రెండున్నరేండ్లలో ఈ ఏయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ, ఇండియన్ ఏయిర్ ఫోర్స్ నుండి సాంకేతిక అనుమతులు సాధించామన్నారు. జాయింట్ యూజర్ ఏయిర్ పోర్టుగా అభివృద్ధి చేసుకునేందుకు ఇండియన్ ఏయిర్ ఫోర్స్ సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. రక్షణ శాఖ ఇటీవలే ఎన్వోసీ ఇచ్చిందని గుర్తుచేశారు.
Read Also: ఏఐ సునామీతో ఉద్యోగాలు ఊస్ట్.. ఏటీసీలతో భరోసా
Follow Us On: Pinterest

