కలం, వెబ్ డెస్క్ : సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ విలన్‌గా నటించి మెప్పించిన ప్రదీప్ సింగ్ రావత్ ( 74) ( Pradeep Rawat) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.
1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ సింగ్ రావత్.. హిందీలో 1985 లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. నితిన్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. సూర్య హీరోగా నటించిన గజినీతో పాటు రాజమౌళి తీసిన ఛత్రపతి మూవీతో మరింత స్టార్ డమ్ తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించిన ప్రదీప్ సింగ్ రావత్.. కొన్ని కమెడియన్ పాత్రలు కూడా పోషిచారు. ‘భద్ర’, ‘యోగి’, ‘దేశముదురు’, ‘అందరివాడు’, ‘స్టాలిన్’ వంటి విజయవంతమైన చిత్రాలలో ప్రదీప్ సింగ్ రావత్ నటించారు.

