కలం, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కు భారత మహిళల క్రికెట్ జట్టు (India Womens Cricket) అర్హత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సంయుక్తంగా ప్రకటించిన సరికొత్త ‘క్వాలిఫికేషన్ పాత్వే’లో టీమిండియా ముందస్తుగానే ఒలింపిక్ బెర్తును ఖరారు చేసుకుంది. 128 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి క్రికెట్ రీ-ఎంట్రీ ఇస్తున్నది. మహిళల లీగ్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ (ఇంగ్లండ్), సౌతాఫ్రికా జట్లు తొలి నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి.
వన్ కాంటినెంట్-వన్ టీమ్
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 లో చూపిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఆయా ఖండాల (ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా) నుంచి అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన జట్లకు ఈ ముందస్తు అవకాశం లభించింది. అయితే ‘ఒక ఖండం – ఒక జట్టు’ అనే ఐసీసీ నిబంధన కారణంగా, ప్రతి ఖండం నుంచి కేవలం ఒకే ఒక జట్టుకు మాత్రమే ఈ డైరెక్ట్ ఎంట్రీ దక్కింది. మొత్తం ఆరు జట్లు తలపడే ఈ మెగా టోర్నీలో మిగిలిన రెండు స్థానాల కోసం సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
ఐదో ప్లేస్ అమెరికాకు..
ఐదో స్థానం ఆతిథ్య దేశమైన అమెరికాకు దక్కనుంది. అయితే 2026 డిసెంబర్ 31 కట్-ఆఫ్ డేట్ నాటికి అమెరికా మహిళల జట్టు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో కచ్చితంగా టాప్-15 లోపు నిలవాలనే కఠినమైన నిబంధనను విధించారు. ఒకవేళ అమెరికా ఆ ర్యాంక్ సాధించడంలో విఫలమైతే, 2027 మార్చి 1 నాటి గ్లోబల్ ర్యాంకింగ్స్ ప్రకారం రేసులో ముందున్న తదుపరి అత్యుత్తమ నాన్-క్వాలిఫైడ్ జట్టుకు ఆ ఛాన్స్ ఇస్తారు.
ఆరో బెర్త్ కోసం టోర్నీ
ఇక టోర్నమెంట్లో చివరిదైన ఆరో బెర్తును డిసైడ్ చేయడం కోసం 2027 లో ప్రత్యేకంగా ఎనిమిది జట్లతో ‘ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫైయర్’ నాకౌట్ టోర్నీని నిర్వహించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ మ్యాచ్‌లు 2028 జులై 12 నుంచి జులై 28 వరకు జరగనున్నాయి.

